శభాష్ చంద్రబాబు.. ఏపీ కోసం మోదీ భజన..?
గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రచార ఆర్భాటం గత వైసీపీ ప్రభుత్వం చేసింది. పిల్లలకిచ్చే చిక్కీపై సైతం జగన్ బొమ్మ వేయించడం అప్పట్లో సర్వత్రా విమర్శలొచ్చాయి. అలాగే ప్రతి పథకానికి ముందు జగనన్న.. ఆ తర్వాత జగనన్న పేర్లు చేర్చడం మనం చూశాం. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో జగన్ పేర్లను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది.
జగనన్న గోరుముద్ద పథకంలో గతంలో అమల్లో ఉన్న విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో కొత్త ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకం పేరు నుంచి జగనన్న అనే పేరును తొలగించారు. ఇక నుంచి కేవలం పీఎం పోషణ్ గోరుముద్దగా దీనిని పిలవనున్నారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు ఆదివారం మినహా ఆరు రోజులు గుడ్డు, చిక్కీలతో కూడిన పౌష్టికాహారాన్ని అందజేస్తారు.
వ్యూహాత్మకంగా జగన్ పేరును తొలగించి ప్రధాని పేరును చేర్చారు. కొత్త సీఎం చంద్రబాబు ఈ మొత్తం పథకంపై జగన్ బ్రాండింగ్ తీసివేసి దానికి టీడీపీ రంగు వేయడానికి బదుల, ప్రధాని పేరు పెట్టడం ద్వారా మరింత సాధారణ ముద్ర వేశారు. వాస్తవానికి ఈ పథకంలో సింహభాగం నిధులను కేంద్రమే అందిస్తోంది. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు మంచి పేరు రావాలని వారి పేర్లు పెట్టుకొని అమలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ పథకానికి పీఎం పోషణ్ గోరుముద్ద సముచితమైందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.