రెచ్చిపోతున్న టీడీపీ.. ఆంధ్రా మరో బీహార్‌ అవుతోందా?

ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న తొలి నిర్ణయం కరకట్టపై నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేత. అధికార పార్టీ నేతలకు ఊహలకందని నిర్ణయాన్ని అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఐఏఎస్ లతో మీటింగ్ రోజు జగన్ ఆ ప్రకటన చేసి.. రేపు ఐపీఎస్ ల సమావేశం తర్వాత ఈ ప్రజావేదిక ఉండదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యే సరికి ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. నాడు కూల్చివేతలపై గొగ్గోలు పెట్టిన టీడీపీ నేతలే నేడు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకు ముందు నుంచే ఏపీలో విధ్వంసం మొదలు పెట్టారు. వైఎస్సార్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్నారు. వైఎస్సార్ పేరు కనిపిస్తే చాలు ఊగిపోతున్నారు.

జగన్ జ్ఞాపకాలు కనిపించకుండా చేయాలని పంతం పట్టారు. తాజాగా అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించిన ప్రాంతంలో నమూనా ఇంటిని ధ్వంసం చేశారు. అక్కడి స్తూపాన్ని విరగ్గొట్టారు. శిలాఫలకాన్ని జేసీబీతో నేల మట్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన చర్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో ఉన్న శిలాఫలాకాలను సైతం ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై బాహాటంగానే దాడులకు తెగబడుతున్నారు. ఈ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదు.  ఈ విషయమై జగన్, వైసీపీ నేతలు గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేసి ప్రయోజనం లేకుండా పోయింది. ఏపీ పోలీసులపై వైసీపీ నేతలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కినా ఉపయోగం లేదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్నట్లు అందరూ మౌన సాక్షులుగా మిగిలిపోతున్నారు. దీంతో ఏపీలో జరుగుతున్న అరాచకాలు దేశ వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి.

ఎన్నికల వేళ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు ఈవీఎంను నేలకేసి కొట్టడం సంచలనం కాగా.. ఇప్పుడు నేలమట్టం అవుతున్న విగ్రహాలు, శిలాఫలకాలు, స్తూపాలు.. ఏపీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ ప్రతీకార జ్వాలలు మరింత పెరిగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాధితులు ఎప్పుడూ సామాన్యులే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: