లోకేశ్‌ కోసమే.. ఆ సీనియర్లను పక్కన పెట్టేశారా?

దిగ్గజాలకూ మొండి చెయ్యే..
కొత్త వాళ్లకే ఎక్కువ అవకాశాలు..
లోకేశ్‌ మార్కు చూపించేందుకేనా?
చంద్రబాబు కొత్త మంత్రి వర్గం కొలువు తీరింది. ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే సహా మొత్తం 24 మందికి మంత్రి పదవులు దక్కాయి. అయితే ఇందులో ఎక్కువ భాగంగా జూనియర్లే ఉండటం విశేషం. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. అలాగే తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారు 17 మంది వరకూ ఉన్నారు. చంద్రబాబు కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు అవకాశం దక్కింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే చంద్రబాబు కేబినెట్‌లో 8 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఎస్టీ మహిళకు చోటు  దక్కింది. మైనార్టీ, వైశ్య సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది.
 
కేబినెట్‌లో నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు చోటు దక్కగా.. మంత్రివర్గంలో ఒక స్థానాన్ని చంద్రబాబు ఖాళీగా ఉంచారు. అయితే పార్టీలో దిగ్గజాలుగా పేరున్న యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వంటి వారికి కూడా ఈసారి మంత్రి పదవులు దక్కలేదు. ఈ కేబినెట్ చూస్తే కొత్త ముఖాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించడమే ఇందుకు కారణంగా టీడీపీ వర్గాలు చెబుతున్నా.. అసలు కథ వేరే ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

తెలుగు దేశం నాయకత్వం క్రమంగా చంద్రబాబు చేతుల్లో నుంచి లోకేశ్‌కు మారాల్సిన అవసరం ఉంది. దీనికి తగ్గట్టుగానే సీనియర్లకు కాకుండా జూనియర్లకు ఎక్కువగా ఛాన్సులు ఇచ్చారని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే మంత్రి వర్గంపై నారా లోకేశ్‌ గ్రిప్‌ తెచ్చుకుంటే.. ముందు ముందు పాలన సులభం అవుతుందని.. అందుకోసమే చంద్రబాబు జూనియర్లకు ఎక్కువగా అవకాశం కల్పించారన్న వాదన వినిపిస్తోంది. మరీ సీనియర్లయితే.. వారిపై అజమాయిషీ చేయడం నారా లోకేశ్‌ కు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అటు సీనియర్లకూ ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల పార్టీలో ఆ ఇబ్బంది రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తగా ఎక్కువగా సీనియర్లకు అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: