దటీజ్‌ చంద్రబాబు.. రాజకీయానికి నిలువెత్తు రూపం?

రాజకీయం కొందరు నాయకులకు వ్యాపకం.. కొందరు నేతలకు పార్ట్‌టైమ్‌ వ్యవహారం.. ఇంకొందరు నాయకులకు సంపాదనకు మార్గం.. కానీ.. చాలా అరుదుగా రాజకీయమే జీవితంగా.. జీవితమంతా రాజకీయమే అన్నట్టుగా జీవిస్తుంటారు. అలాంటి ఓ అరుదైన నాయకుడు నారా చంద్రబాబునాయుడు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్పటి నుంచి.. ఇప్పుడు విభజిత ఏపీకి మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నప్పటి వరకూ ఆయన జీవితం నిత్యం రాజకీయాలతోనే ముడిపడి ఉంటుంది.

గెలిచినా.. ఓడినా.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం ప్రజల మధ్య ఉండటం.. ప్రజాసమస్యలపై ఆలోచించడం.. పార్టీని కాపాడుకోవడం.. ఇదే చంద్రబాబు జీవితం.. చంద్రబాబు జీవితం నుంచి రాజకీయాలు తీసేస్తే ఇంకేమీ మిగలదేమో అన్నంతగా ఆయన రాజకీయాలను శ్వాసిస్తారు. అభిప్రాయం మార్చుకోనివాడు పొలిటీషియనే కాడోయ్‌ అంటాడు కన్యాశుల్కంలో గిరీశం. ఈ చిన్న లాజిక్‌ తెలియక చాలామంది రాజకీయ నాయకుల జీవితాలు ముగిసిపోతుంటాయి. తాము చేసిందే కరెక్టు అన్న భావనతో కాలదోషం పట్టిపోతుంటారు.

కానీ చంద్రబాబు అలా కాదు.. కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులు వేస్తుంటారు. కాలం అనుకూలించనప్పుడు ఓర్పుతో.. సహనంతో ఎదురు చూస్తారు. సరైన సమయం వచ్చే వరకూ వేచిచూస్తారు. జీవితంలో క్రీడల పట్ల పెద్ద ఆసక్తి లేకపోయినా రాజకీయ చదరంగం అంటే చంద్రబాబుకు మహా ఇష్టం. అందుకే రాజకీయాల్లో ఇంత సుదీర్ఘమైన కెరీర్‌ ఆయనకు దక్కింది. బహుశా దేశంలోనే ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న నేతలు చాలా అరుదనే చెప్పుకోవాలి.

ఇక చంద్రబాబు పనైపోయింది.. ఈ మాట గతంలో చాలాసార్లు వినిపించింది. అయితే ఆ మాట వినిపించిన కొన్నాళ్లకే తానేంటో నిరూపిస్తూ ఆయన మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడేవారు. తన సత్తా ఏంటో చూపించేవారు. తాజాగా ఇప్పుడూ అదే జరిగింది. 75 ఏళ్ల వయస్సులో ఆయన తన జీవితంలోనే అత్యంత ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. రాజకీయమే ఆశగా శ్వాసగా అడుగులు వేసే చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మరింతగా అభివృద్ధి చెందాలని ఇండియా హెరాల్డ్‌ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: