రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న కరెంట్ షాక్‌?

తెలంగాణలో అధికార కాంగ్ఎస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఇంకా కరెంట్ గొడవ సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ అన్నారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్  ఎన్నికలకు వెళ్లింది. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు ఉంటాయని ప్రధానంగా ప్రతి సభలోను కేసీఆర్ విమర్శించారు.  మూడు గంటలా.. 24 గంటలా తేల్చుకోవాలని నినాదం కూడా ఇచ్చారు.

ఇక సీన్ కట్ చేస్తే తెలంగాణ ప్రజలు కాంగ్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. అయినా ఇంకా విద్యుత్తు వివాదం ముగిసిపోలేదు. కరెంట్ కోతలు ఉన్నాయంటూ.. హైదరాబాద్ ను పవర్ హబ్ గా మార్చామని అయినా.. చిన్నపాటి వర్షానికే కరెంట్ పోతుందని మాజీ సీఎం కేసీఆర్ ఓ  ఇంటర్వ్యూలో విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విద్యుత్ రంగంపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని.. మొత్తం రుణాలే ఉన్నాయని శ్వేతపత్రం విడుదల చేశారు.

కావాలనే కొంతమంది అధికారులు అప్రకటిత కోతలు విధిస్తున్నారని..  పది హేను నిమిషాలకు మించి కరెంట్ నిలిచిపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అయితే కరెంట్ అన్నాక అంతరాయాలు కామన్.. కానీ దీనినే రాజకీయంగా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇంకా విద్యుత్తు శాఖలో ఆ పార్టీకి మేలు చేసేవారు ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

 తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విద్యుత్తు కోతలకు బీఆర్ఎస్సే కారణం అని మండిపడ్డారు. విద్యుత్తు శాఖలో కొందరు కావాలనే పవర్ కట్ చేస్తున్నారని.. అందుకే కొన్ని చోట్ల  కోతలు తలెత్తుతున్నాయన్నారు సీఎం. దీని వెనుక మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్నారని.. ఆయనే ఇలాంటి పనులు చేయిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఆరోపించారు. దీనిపై హరీశ్రావు, కేటీఆర్ లు మండిపడ్డారు. తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రతిపక్షాల మీద, ఉద్యోగుల మీద అభాండాలు మోపుతున్నారని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అంశంపై రాబోయే రోజుల్లో మరింత రచ్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: