బాబుకు షాక్: కూటమికి బిగ్ మైనస్‌గా మోదీ ప్రచారం?
అయినా సరే.. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు.. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ఎన్డీఏలో టీడీపీని చేర్చుకున్నారు. అది కూడా దాదాపు నెల రోజుల పాటు నాన్చి అయిష్టంగానే చేర్చుకున్నట్టు కనిపించింది. ఎలాగోలా ఎన్డీఏలో చేరినా.. మోదీ, అమిత్ షాల తీరు మాత్రం ఇంకా జగన్ వైపే ఉన్నట్టు జనం భావించేలా వారి సభలు జరిగాయి. మొట్టమొదటగా చిలకలూరి పేట సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కూటమి నేతలను ప్రత్యేకించి టీడీపీ నేతలను దారుణంగా నిరాశపరిచారు.
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కారుపై పల్లెత్తు విమర్శ కూడా చేయకుండా ఆ సభలో మోదీ వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనంటూ కొత్త వాదన అందుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట.. ఇతర సభల్లోనూ మోడీ పెద్దగా జగన్ ను విమర్శించిందే లేదు. అసలు ఇన్ని సభల్లో పాల్గొన్నా.. మోడీ నోట ఒకే ఒక్కసారి జగన్ రెడ్డి అనే పదం వచ్చింది. అది కూడా వైఎస్ వారసుడిగా పోలవరాన్ని పట్టించుకోలేదని అన్నారు తప్ప జగన్‌ను నేరుగా విమర్శించింది లేదు.
అంతే కాదు.. మోడీ నోట కనీసం తెలుగు దేశం అనే పదం కూడా వినిపించలేదు. తెలుగు దేశం ప్రభుత్వం వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అన్న హామీలు కూడా లేవు. ఇక చివరిగా జరిగిన రాజంపేట సభలోనైనే ఏపీలో పెద్దగా ఉనికిలో లేని కాంగ్రెస్‌పై విమర్శలకే మోదీ పెద్ద పీట వేశారు. ఇలా సాగిన మోదీ సభలతో టీడీపీ శ్రేణులు పూర్తిగా డీలా పడటమే కాకుండా.. బీజేపీ నేతల తీరు పట్ల కుతకుతా ఉడికిపోతున్నారు. మరి ఈ బలవంతపు స్నేహాలు ఎలాంటి ఫలితం రాబడతాయో చూడాలి.