కేసీఆర్‌.. చింత చచ్చినా పులుపు చావలేదా?

మూడో సారి కచ్ఛితంగా హ్యాట్రిక్ కొడతామని భావించి ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పెద్ధ  షాక్ నే ఇచ్చాయి. బీఆర్ఎస్ ఊహించని స్థాయిలో అపజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ తెలంగాణ అధికార పీఠాన్ని దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు వ్యూహ రచన చేస్తున్నాయి.

అయితే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బీఆర్ఎస్ అంత సులభంగా బయట పడలేదు. దీనిపై కేసీఆర్ కూడా స్పందించలేదు.  కేటీఆర్, హరీశ్ రావులు పార్టీ ఓటమిపై పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇంత చేసినా.. ఇన్ని పథకాలు అమలు చేసినా ఎందుకు ఓడిపోయామో అర్థం చేసుకోలేకపోయారు. పైగా ఆ నెపాన్ని ప్రజలపై నెట్టే ప్రయత్నం చేశారు తప్ప బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించలేకపోయారు.

ప్రజలు పొరపడి తమను వద్దు అనుకున్నారు అనీ.. ఇది ప్రజలు చేసిన పొరపాటుగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఇక కేసీఆర్ కూడా ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారు అని.. బీఆర్ఎస్ పాలన అంతా సవ్యంగానే ఉందని వివరించారు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని సుల్తానా పుర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ కు పెద్దగా పోయేదేమీ లేదని..  పైగా ప్రజలకే నష్టం అని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ కథ కంచికే అనే విషయం ప్రజలతో పాటు కేసీఆర్ కు కూడా బాగా తెలుసు. అయినా కానీ ఇంకా ప్రజలను బెదిరించే విధంగానే మాట్లాడుతున్నారు కానీ.. ఆ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. తాము ప్రజలను మెప్పించలేకపోయాం అని అందుకే ఓడిపోయాం అని చెప్పడం మానేసి.. బీఆర్ఎస్ ను గెలిపించకపోతే మీ ఖర్మ అనే తరహాలో మాట్లాడటం ఆ పార్టీకే చేటు తెస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: