ఆ ఎంపీ సీటు వైసీపీ గెలిస్తే.. జగన్‌కు తిరుగులేదన్నట్టే?

గత ఎన్నికల్లో జగన్ గెలవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. తెర ముందు.. తెర వెనుక అనేక మంది పనిచేశారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చింది. జగన్ కు ఒక ఛాన్స్ అంటూ కోరడంతో ప్రజలంతా అవకాశం ఇచ్చారు. గత ఎన్నికలకు ముందు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు పనిచేయగా.. ఇప్పుడు మాత్రం జగన్ ఒక్కరే మిగిలారు.

గత ఎన్నికల్లో జగన్ విజయానికి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ కాళ్లకు బలపం కట్టుకొని మరీ తిరిగారు. కానీ ఐదేళ్ల కాలంలో అంతా తారుమారు అయింది. కుటుంబ సభ్యుల్లోనే జగన్ కు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వైఎస్ షర్మిళ అన్నను విభేదించి తెలంగాణలో పార్టీని స్థాపించి.. ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి అన్న ఓటమికి కృషి చేస్తున్నారు. ఇంతకాలం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని మాట్లాడిన ఆమె.. ఇప్పుడు ఏకంగా జగన్ ని ఓడించండి అంటూ ఓపెన్ అయ్యారు.

కడప లోక్ సభ ఎంపీ గా ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ బరిలో ఉన్నారు. ఈ లోక్ సభ పరిధిలోని పులి వెందుల నుంచి సీఎం జగన్ అభ్యర్థిగా ఉన్నారు. జగన్ ని ఓడించండి అంటూ షర్మిళ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ప్రకటించారు. ప్రస్తుతం షర్మిళ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.

జగన్ ప్రభుత్వం ఓడటం అనేది నిన్నటి మాట అయితే జగన్ ని ఓడించండి అంటూ షర్మిళ డైరెక్ట్ ఫైట్ కే రెడీ అయ్యారు. ఇక ఈమె వెంట దివంగత వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఉన్నారు. ఇప్పుడు సీఎం జగన్ పై వివేకా సతీమణి, జగన్ పిన్ని సౌభాగ్యమ్మ పులి వెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మొత్తానికి వైఎస్ కుటుంబం రెండుగా నిట్టనిలువునా చీలిపోయింది. ఈనేపథ్యంలో కడప వాసుల ఆలోచనలు ఎలా ఉన్నాయో.. వారి తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: