చంద్రబాబు ఆయనకు టిక్కెట్ ఇచ్చి.. మోడీ తలెత్తుకోలేకుండా చేసేశారే?

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి కుమారుడు తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఏపీలో ఎన్డీయే కూటమి లోక్ సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది ఈ కేసుతో బీజేపీకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందని పేర్కొంది. ఆప్ నేతలు, దిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ విలేకర్లతో మాట్లాడారు.

ఈడీ నిజంగానే స్వతంత్ర సంస్థ అయితే మద్యం కేసుకు బీజేపీకి ఉన్న సంబంధంపై దర్యాప్తు జరపాలని అతిషి సవాల్ విసిరారు. సౌత్ లాబీ పేరుతో ఉన్న మద్యం వ్యాపారులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఇదే కేసులో అప్రూవర్ గా ఉన్న శరత్ చంద్రా రెడ్డి కూడా ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో బీజేపీకి  రూ.55 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వరకు సాక్షులను ఈడీ వేధింపులకు గురి చేస్తోందని ఆతిషి ఆరోపించారు.

దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి తొలుత అరెస్టయ్యారు. అనంతరం కాలంలో అప్రూవర్ గా మారి బెయిల్ పై విడుదలయ్యారు. మరోవైపు, దిల్లీ వాటర్ బోర్డులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ దాదాపు 8 వేల పేజీలతో కూడిన తొలి ఛార్జిషీటును మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది.

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సాక్షుల్లో ఒకరికి, బీజేపీకి సంబంధం ఉందని ఆరోపించారు. ఇటీవల వరకు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్నం విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరు టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు వీటిని అస్త్రాలుగా మలుచుకొని మోదీని టార్గెట్ గా చేసుకొని ఆప్ విమర్శలు గుప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: