బీజేపీ ముందు క్యూ కడుతున్న కుబేరులు?

చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి చేరుతాయి. ఒక్కో మట్టి రేణువు పోగేసి కష్టపడి చీమలు పుట్టలు పెడితే.. పాములు వచ్చి చక్కగా విశ్రాంతి తీసుకుంటాయి. తిరిగి చీమలు మరో పుట్టను పెట్టుకుంటాయనేది సామెత. ఇది నేటి రాజకీయాల్లో సరిగ్గా సరిపోతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడతారు. ర్యాలీలు తీస్తారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ప్రచారం నిర్వహిస్తారు. ఏదైనా అల్లర్లు జరిగితే దెబ్బలు తింటారు. వీరిపై కేసులు పెడతారు. జైలుకు వెళ్తారు.

అయితే.. ఎన్నికల సమయం వచ్చే సరికి ఆయా పార్టీలకు డబ్బున్న నేతలు అవసరం ఉంటుంది. వీరికి నిరాశే ఎదురవుతుంది. వీటికి ప్రత్యామ్నాయ రాజకీయాలు చేద్దామని.. రబ్బరు చెప్పులు వేసుకొనే సామాన్యుడిని అసెంబ్లీకి పంపుదామని పవన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందుకోసమే పార్టీని పెట్టానని బీరాలు పలికారు. గతంలోనే ఇదే నినాదంతో ఎన్నికలకు వచ్చి చేసి చూపించిన వారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.

పవన్ కల్యాణ్ కూడా ఏపీ కేజ్రీవాల్ అవుతారని భావిస్తే.. మళ్లీ రాజకీయ నాయకుని అవతారమే ఎత్తారు. ఆయన ప్రకటించిన అభ్యర్థులను పరిశీలిస్తే ఎంపీ బాల శౌరి, సానా సతీశ్ లు ఆపార్టీ నాయకులు కాదు. పైగా సామాన్యులా అంటే అదీకాదు. డబ్బున్న నాయకులు. అసెంబ్లీ స్థానాల్లో కూడా కనీసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఎలా అంటూ తిరిగి పార్టీ శ్రేణుల్నే ప్రశ్నిస్తున్నారు. డబ్బున్న వారు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేశ్  లాంటి నాయకులకే సీట్లపై కొంత నమ్మకం ఉంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అలానే తయారైంది.

టీడీపీతో బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తుందని తేలింది. ఇందులో ఐదు నుంచి ఏడు వరకు ఎంపీ సీట్లు రావొచ్చనే ప్రచారం నడిచింది. ఇప్పటికే ఈ పార్టీలో ఐదారుగురు కోటీశ్వరులు ఈ సీట్ల కోసం పోటీ పడుతున్నారంట. 12మంది కోటీశ్వరులు అసెంబ్లీ స్థానాలకు కోసం పట్టుపడుతున్నారని సమాచారం. మరి పార్టీ కోసం కష్టపడిన వారికి సీట్లిస్తారా.. లేక డబ్బున్న వారికే అందలమెక్కిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: