కేసీఆర్.. బాబును చూసి నేర్చుకోవాల్సింది ఇదే?

రాజకీయ అంటే ఒక రంగుల రాట్నం.  ఒక్కసారి పైకి తీసుకు వెళ్తుంది.  మరొకసారి కిందకి దించుతుంది. ఒకేసారి తిప్పికూడా వదిలేస్తుంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. తమకు తిరుగులేదని భావించిన గులాబీ నేతలకు షాక్ ఇచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు డీలా పడ్డారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీ కీలక నేతలు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కూడా.

ఇదిలా ఉండగా.. కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. క్యాడర్ లో జోష్ నింపేందుకు ఆయన చెప్పిన మాటలు బూమ్ రాంగ్ అయినట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ అంత నేతకే తప్పలేదు. మనమెంత అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంటే కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేశారా అన్న అనుమానం పార్టీ క్యాడర్ లోకి వెళ్లిపోయింది.

కేసీఆర్ గురువు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నాడు. ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా పడి లెచిన కెరటంలా ఓడినా.. మళ్లీ గెలుస్తున్నాడు. ఓడినప్పుడు కుంగిపోవడం లేదు. కసిగా పనిచేస్తున్నారు. క్యాడర్ చేజారకుండా చూసుకుంటున్నారు. వైఎస్ హయాంలో రెండు సార్లు ఓడిపోయినా మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. 2019లో జగన్ చేతిలో ఓడిపోయినా.. ఏడు పదుల వయసులో అధికారమే లక్ష్యంగా కసిగా పోరాడుతున్నారు. 74 ఏళ్ల వయసులో జగన్ జైల్లో పెట్టించినా తడబడలేదు. కానీ కేసీఆర్ ఒక్క ఓటమికే పూర్తిగా కుంగిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా కేసీఆర్ వేదాంతం మాని చంద్రబాబు తరహాలో పార్టీని కాపాడుకొని.. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: