పవన్ సీట్లను ప్రత్యేకంగా టార్గెట్‌ చేస్తున్న జగన్‌?

ఈ ఎన్నికల్లో పవన్ ను చావు దెబ్బ తీయాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇదే మాదిరిగా ఈ ఎన్నికల్లో సైతం పవన్ ను ఓడించాలని జగన్ భావిస్తున్నారు. పవన్ ఎక్కడి నుంచి బరిలో దిగితే అక్కడ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గట్టి అభ్యర్థిని పవన్ పై పోటీకి పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. అయితే తాజాగా తిరుపతిలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.

తిరుపతి అసెంబ్లీ స్థానానికి భూమన అభినయ్ రెడ్డి పేరును జగన్ ఇప్పటికే ఖరారు చేశారు. ఈయన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు. వై.వి సుబ్బారెడ్డి ని మార్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి టీటీడీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఈయన స్థానంలో అభినయ్ రెడ్డి ని జగన్ ఎంపిక చేశారు.

అయితే తాజాగా పవన్ కల్యాణ్ తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన చిరంజీవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం లో పార్టీ చేసిన నేతలకు పవన్ కల్యాణ్ టచ్ లోకి వెళ్లారు. నియోజకవర్గ స్థితిగతులను తెలుసుకుంటున్నారు.

పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలియడంతో ముద్రగడకు టచ్ లోకి వైసీపీ నాయకులు వెళ్లారు. ఇప్పుడు తిరుపతి వైపు రావడంతో కొత్త వ్యూహానికి పదును పెట్టారు. ఇక్కడ బలిజ ఓట్లు అధికం. అదే స్థాయిలో బీసీ ఓటర్లు ఉన్నారు. అందుకే బీసీ అస్త్రాన్ని జగన్ తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ మేయర్ గా ఉన్న శిరీష పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఆమె బలమైన మహిళా నేత. పవన్ పై మహిళా అభ్యర్థిని బరిలో దింపి.. అభినయ్ రెడ్డికి మేయర్ పదవి అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నారనే టాక్ నడుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: