కేసీఆర్ ఎఫెక్ట్: జగన్ చిట్కా పని చేస్తుందా?
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల్లో అలజడి మొదలైంది. 2024 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఏడాది నుంచే సర్వేలు చేపట్టింది. ఈసారి ఓటమి ఖాయం అనుకున్న ఎమ్మెల్యేలను జగన్ నిర్మొహమాటంగా పక్కన పెడుతున్నారు. అయితే వ్యతిరేకత పార్టీపైనా.. లేక అభ్యర్థులపైనా అనేది తేలాల్సి ఉంది.
ప్రస్తుతం 65 స్థానాల్లో అభ్యర్థులను మార్చుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడవచ్చని వైసీపీ భావిస్తోంది. కొద్ది మంది నిర్వాకం వల్ల పార్టీకి నష్టం వచ్చిందని తాము మంచి పాలన అందిస్తున్నామనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అభ్యర్థులను మార్చినంత మాత్రాన వ్యతిరేకత పోతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అభ్యర్థులను మార్చిన చోట కూడా అక్కడి వారిని ఇక్కడికి ఇక్కడి వారిని అక్కడికి బదిలీ చేశారు తప్ప.. కొత్తగా ఎవర్నీ తీసేయలేదు. ఈ నిర్ణయం ఆ పార్టీకి ఎలా మేలు చూకూర్చుతుందో అంతుపట్టడం లేదు. ఓటర్లు కూడా ముందు సీఎం అభ్యర్తినే చూస్తారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యేని చూసుకుంటారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. ప్రభుత్వంపై అతని ఆలోచన విధానం ఎలా ఉంది అనే అంశాలపైనే ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కిందటి సారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు చాలామంది కొత్తముఖాలే. టీడీపీని ఓడించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఓటరు ఏం ఆలోచిస్తారే మీద పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి తప్ప అభ్యర్థులను మార్చడం.. బదిలీ చేయడం వంటికి తాత్కాలిక ఉపశమనాలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.