తెలంగాణలో గెలిస్తే.. కాంగ్రెస్ దేశంలోనూ గెలుస్తుందా?

తెలంగాణాతో పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదేళ్లు కావొస్తుంది. గతంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయినా.. ప్రస్తుతం ఉన్న దీనస్థితిలో ఎప్పుడూ లేదు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో హస్తం పార్టీ లో కొంత నూతనోత్సాహం వచ్చింది.  ఇప్పుడు తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


ఇందులో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్నవి. అయితే ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఎందుకంటే సార్వత్రికానికి ముందు ఇవి సెమీ ఫైనల్ వంటివి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే ఆ పార్టీ  ప్రభావం దేశం పై పడుతుందని పలువురు చెబుతున్నారు.


కానీ 2018 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్  లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి ఫలితాలు తారుమారయ్యాయి. ఆ ప్రభావం ఎంపీ ఎన్నికలపై చూపలేదు. అలాగే ఇప్పుడు మళ్లీ ఆ మూడు రాష్ట్రాల్లో గెలిచినా వచ్చే ప్రభావం కొత్తగా ఏమీ ఉండదు. కాంగ్రెస్ పుంజుకుంటుంది అని చెప్పడానికి ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు బలాన్ని చేకూర్చవు.  


ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. అలాగే మధ్యప్రదేశ్ లో రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత సహజం. కానీ కేంద్రంలోని మోదీ సర్కారుపై వారికి అపార నమ్మకం ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లో దాదాపు 60 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకొంది. ఇటీవల కర్ణాటక లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది కొంతమేర  ఆ పార్టీకి ఉత్సాహనిచ్చేదే.  ఈ ఫలితాల తర్వాతే ఇండియా కూటమి లోకి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వచ్చి చేరాయి. 2004,09లో కూడా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో గెలిచింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.  ఇప్పుడు తెలంగాణలో గెలిస్తే ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి అత్యవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: