మంద కృష్ణ మాదిగ.. చరిత్రలో నిలిచిపోతారా?
అయితే ఎస్సీల్లో మాదిగలకు వెనుకబాటు తనానికి గురవుతున్నారనే విషయాన్ని గుర్తించిన మందకృష్ణ మాదిగ 10మంది యువకులతో చిత్తూరు నుంచి తన పోరాటాన్ని ప్రారంభించారు. అయితే ఆ అంశాన్ని రాజకీయంగా మలచుకొని లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు. కానీ మందకృష్ణ మాత్రం స్వచ్ఛందంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆయనకు ఏ పదవి కట్టబెట్టలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, ఇతర నామినేటిడ్ పదవులు ఏవీ కూడా ఇవ్వలేదు.
కానీ ఆయన్ను అడ్డుపెట్టుకొని టీడీపీ బాగానే లబ్ధి పొందింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా చేసింది. 30 ఏళ్ల నుంచి అనేక త్యాగాలు చేస్తూ పోరాటాలు సాగించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ గుర్తించి మందకృష్ణ మాదిగ తన యవ్వనాన్ని అంతా పోరాటానికే ధారపోశారు అని వ్యాఖ్యానించారు.
అయితే రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో మాదిగలు.. ఏపీలో మాలలు ఎక్కువగా ఉండటంతో టీడీపీ ఆయన్ను వదిలిపెట్టింది. ప్రధాని మోదీ మాత్రం ఎస్సీల వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని త్వరలోనే కమిటీ వేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఈ విషయంలో మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పడం ఆయన నా సోదరుడితో సమానం అని వ్యాఖ్యానించారు. ఒకవేళ బీజేపీ మరలా అధికారంలోకి వచ్చి ఈ వర్గీకరణ చేపడితే మందకృష్ణ చరిత్రలో కచ్చితంగా నిలిచిపోతారు అని చెప్పడంలో సందేహం లేదు.