రేవంత్ రెడ్డి.. రాటుదేలి పోయాడా?
2018 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే భావనతో కాంగ్రెస్, తెజస, టీడీపీ, కమ్యూనిస్టులు జట్టు కట్టి ఎన్నికలకు వెళ్లాయి. టీడీపీ తో కలసి ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా దాదాపు మళ్లీ అవే రాజకీయ పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లకున్నా.. వారి మద్దతుతో రేవంత్ రెడ్డి ఈ సారి ఎన్నికలకు వెళ్తున్నారు.
గత ఓటమి పాఠాలు నేర్చుకున్న రేవంత్ ఈ సారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మాకు కొన్ని సీట్లు కావాలని కోరిన తెజసకు సీట్లు ఇవ్వకుండా ప్రొఫెసర్ కోదండరాంతో చర్చలు జరిపి వారి మద్దతు పొందేలా రేవంత్ పక్కా ప్రణాళికలు రచించారు. దీంతో ఉద్యమకారుల ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీని ఎన్నికల నుంచి దూరం చేయడంలో రేవంత్ హస్తం కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు విషయంలో బీఆర్ఎస్ వైఖరి నచ్చని ఆ పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనేది తెలిసిన విషయమే.
టికెట్ల విషయంలోను రేవంత్ తన వర్గం వారికే టికెట్లు ఇప్పించుకోగలిగారు. రెండో విడత బస్సు యాత్ర సందర్భంగా డీకే శివకుమార్ సమక్షంలోను రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక అని పరిగి అభ్యర్థి దాదాపు నాలుగు సార్లు అన్నా రేవంత్ ఆయన్ను వారించలేదు. తద్వారా జనాల్లో రేవంత్ రెడ్డే సీఎం అనే వాదాన్ని బలంగా తీసుకువెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లను వాళ్ల నియోజకవర్గాలకే పరిమితం చేసి పార్టీలో అంతా తానై పంచముఖ వ్యూహంతో కథ నడిపిస్తున్నారు.