అయోధ్య రామయ్యకు విదేశాల నుంచీ విరాళాలు?

అయోధ్య రామాలయ చరిత్ర మన అందరికీ తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని సుదీర్ఘంగా విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం చివరకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతి ఒక్క హిందువుని కల అని చెప్పడంలో సందేహం లేదు. అయితే దీనికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  


ఇప్పటి వరకు ఈ ఆలయ నిర్మాణానికి స్వదేశీ విరాళాలు తీసుకుంటున్నారు. ఇక నుంచ విదేశీ విరాళాలు సేకరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎఫ్సీఆర్ఏ (FCRA) అనుమతి మంజూరు చేసింది. ఇది అయోధ్యలో  రామ మందిర నిర్మాణానికి దేశం వెలుపల నుంచి ద్రవ్య విరాళాలను స్వీకరించడానికి ట్రస్ట్ కు అనుమతి ఇస్తోంది. ఈ మేరకు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


దిల్లీలోని ఎస్బీఐ 11 సంసద్ మార్గ్ బ్రాంచిలో ఉన్న రామాలయ బ్యాంకు ఖాతాకు ఈ విరాళాలు పంపవచ్చని ట్రస్ట్ తెలిపింది. విదేశీ మూలాల నుంచి స్వచ్ఛంద విరాళాలను స్వీకరించడానికి ఎఫ్సీఆర్ఏ విభాగం ట్రస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని రిజిస్టర్ చేసింది. ఇలాంటి విరాళాలను కేంద్రం గుర్తించిన బ్యాంకు ఖాతాకు మాత్రమే పంపవచ్చు.  మరే ఇతర బ్యాంకు ఖాతాలో ఈ విరాళాలు అంగీకరించరు.  దీంతో విదేశాల్లో ఉండే రామ భక్తులు ఇకపై ఈ ఖాతాకు విరాళాలు పంపేందుకు అవకాశం ఉంటుంది.


అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ఠ లేదా ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తి కానుంది.  ఇప్పటి వరకు ఆలయ నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు అయ్యాయని.. ఇంకా రూ.3000 కోట్లు బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ ఉందని ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి 15 వరకు ఐదు లక్షల గ్రామాల్లో పూజ అక్షింతలు పంపిణీ చేయాలని ట్రస్ట్ భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: