కేటీఆర్ ఆంధ్రా ప్రేమ.. ఆంతర్యం ఏమిటో?
ఒకప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాలంటే ఆయా కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాలను ఆశ్రయించేవి. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలను ఎంపిక చేసుకుంటున్నాయి. అగ్రశ్రేణి నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఉద్యోగులు జీతాలు ఎక్కువగా అడుగుతున్నారు. అదే ద్వితీయ శ్రేణి నగరాలైతే తక్కువ జీతంతో పనిచేసే వారుంటారు. ఇప్పుడు ఆ విధంగా ఆలోచన చేస్తున్నాయి. ఎక్కడ నుంచి అయినా పని నడపవచ్చు. కరోనా నేర్పిన పాఠంగా దీనిని చెప్పవచ్చు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమకొండలోని మడికొండలో ఐటీ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్వాడ్రంట్ రిసోర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంశీరెడ్డి, రామ్ భాస్కర్ లకు ఆంధ్రాలో కూడా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. భీమవరం, నెల్లూరు లాంటి చోట్ల స్థలాన్ని కూడా ఇప్పిస్తాను. అవసరమైతే ఏపీ సీఎం జగనన్నతో కూడా మాట్లాడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కులం, మతం పేరుతో తన్నుకోకుండా ప్రశాంత జీవనం గడపాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీ పరిస్థితిని వివరిస్తూ మాట్లాడారు అని టీడీపీ నేతలు విమర్శిస్తుంటే.. ఎన్నికల వేళ తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లను ఆకర్షించడానికే ఇలా మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఏపీలో పెట్టుబడులు పెట్టండి సీఎంతో నేను మాట్లాడతాను అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవే.