జైల్లో చంద్రబాబు.. రంగంలోకి బాలయ్య?
అందుకే నారా లోకేశ్, బాలకృష్ణ ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లోకేశ్ రాజమండ్రిలో మకాం వేసి బాబు జైలు వ్యవహారాలు చూస్తుంటే.. బాలయ్య మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు వచ్చి మిగిలిన నాయకులతో సమీక్ష నిర్వహించారు. సాధారణంగా బాలయ్యకు ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా కొత్త. కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది బాలయ్య సమర్థతకు పరీక్ష.
అసలు బాలయ్యకు మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి లేదు. అందుకే ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఎప్పుడూ ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తానేంటో తన సినిమాలేంటో అంతే బాలయ్య ప్రపంచం. అసలు ఎన్టీఆర్కు తన రాజకీయ వారసత్వం బాలయ్యకు ఇవ్వాలని మనసులో ఉండేది. మనసులోనే కాదు.. ఆయన బహిరంగంగానే కొన్నిసార్లు బాలయ్యే తన రాజకీయ వారసుడు అని కూడా ప్రకటించారు.
కానీ బాలయ్య దాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా అప్పట్లో లేరు. దాన్ని అవకాశంగా చంద్రబాబు మలచుకున్నారు. సహజంగానే వ్యూహచతురుడైన చంద్రబాబు పార్టీ ఎన్టీఆర్ హయాంలోనూ.. ఆయన తర్వాత పార్టీని సమర్థంగా నడిపించారు. ఆ తర్వాత కూడా బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైనా అంతా పార్టీ ప్రభావమే తప్ప.. తన సొంత మార్కు ఏమీ లేదు. ఎమ్మెల్యేగా అడపాదడపా సొంత నియోజకవర్గానికి వెళ్లడం, అసెంబ్లీకి రావడం తప్ప..నిజంగా రాజకీయం, పాలన, వ్యూహాలు వంటి విషయాలు బాలయ్యకు అంతగా పట్టవు. కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన సమయం వచ్చింది. మరి బాలయ్య ఎంత సమర్థంగా పార్టీని నడిపిస్తారో చూడాలి.