మద్రాస్ హైకోర్టు తీర్పు.. సమాజానికి మేలుకొలుపు!
తమిళనాడులోని ఈరోడ్ లో నివసిస్తున్న తంగమణి అనే ఆమెకు భర్త చనిపోయాడు. ఆమె భర్త గతంలో ఒక హిందూ ఆలయంలో పూజారిగా పని చేసేవాడు. ఆయన బ్రతికుండగా ఈ తంగమణి ఆలయంలో అన్ని సేవలు చేస్తూ ఉండేది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆమె భర్త చనిపోయిన తర్వాత కొంతమంది బ్రాహ్మణులు ఒక వితంతువు గుడిలోకి రాకూడదని ఆమె పై బహిష్కరణ విధించారట.
ఆ ఆలయంలో దేవుడికి జరిగే ఉత్సవాలకి ఆమె రాకూడదంటూ గ్రామ పెద్దలు హుకుం జారి చేసారట. అయితే ఈ మూఢ విశ్వాసాలతో, ఛాదస్తాలతో విసిగి పోయిన ఆమె కోర్టును ఆశ్రయించింది. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రస్తుతం ఇంత నాగరికత అభివృద్ధి చెందిన కాలంలో వితంతువులను గుడికి అనుమతించని పరిస్థితి అయితే లేదు. అయితే ఆ గ్రామ పెద్దల చర్య పై తాజాగా అక్కడ హైకోర్టు మండి పడింది.
వితంతువు అనే కారణంతో ఒక ఆలయంలోకి అనుమతి ఇవ్వకపోవడం అనేది నేరం అవుతుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై మండిపడ్డారు. నాగరిక సమాజంలో ఇలాంటి మూడ విశ్వాసాలు ఇంకా కొనసాగుతూ ఉండడం దురదృష్టకరమని ఆయన తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా వితంతువులను ఆలయంలోకి అనుమతించకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు చెప్పింది. ఇకపై తంగ మణిని, ఆమె కొడుకును ఆలయంలోకి రానీయకుండా ఎవరైనా ఆపినా, ఆమెను అవమానించినా కఠిన చర్యలు తప్పవని కోర్టు తీర్పు వెల్లడించింది.