బ్రిటన్: ఇంకా పట్టాభిషేకాలు అవసరమా?
ఏనుగులు, గుర్రాలు, పల్లకిలు, ఒక్కటేమిటి అన్ని హంగులూ, తేజస్సు ఉట్టిపడేలా బ్రిటన్ రాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచ నలుమూలల ఉన్న ద్వీపాల నుంచి అన్ని దేశాలను అదుపులోకి పెట్టుకుని ప్రజల్ని బానిసలు చేసుకుని వారు రాజులుగా చెలామణి అయ్యారు.
అలా అయిన వ్యక్తుల రాజ వంశానికి చెందిన చార్లెస్ 74 ప్రస్తుతం బ్రిటన్ లో అంబరాన్ని అంటే సంబరాల మధ్య రాజుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయినా రాజులు అనే వారు ఎప్పుడో ఎక్కడో పాఠాల్లో వినేవాళ్లం. కానీ రాజుగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారంటే నిజంగా ఈ కాలంలో ఆశ్చర్యం కలిగించక మానదు. ఎందుకంటే దేశ విదేశాల్లో ప్రజలను బానిసలు చేసుకుని అక్కడ ఉన్న సంపదను దోచుకుని, రాజభోగాలు అనుభవించారు.
ఎంతో మంది మాన ప్రాణాలతో ఆడుకున్న బ్రిటిష్ వారిని భారత్ నుంచి వెళ్లగొట్టేందుకు స్వాతంత్య్ర ఉద్యమమే చేయాల్సి వచ్చింది. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ రక్తాన్ని, స్వేదాన్ని చిందించి ప్రాణ త్యాగాలు చేసి మరి స్వేచ్ఛ వాయువులు అందించారు. పోనీ బ్రిటన్ లో ఏమైనా ప్రజలు రాజభోగాలు అనుభవిస్తున్నారా అంటే అదీ లేదు. వారి ఉద్యోగాలు పోయి, ఆస్తులు అంతస్థులు కరిగిపోయి, చివరకు అప్పులపాలై ఇబ్బందికర జీవనం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో బ్రిటన్ రాజుగా అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారం చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచాన్నే పాలించినా వారికి ఇలాంటి పట్టాభిషేకాలు, ప్రమాణ స్వీకారాలు చేసుకోవాల్సిందేనా?