కొట్టుకుంటున్న నాయకులు.. జగన్ పట్టించుకోవట్లేదా?
అద్దంకి వైకాపా నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న కృష్ణ చైతన్య మాకు వద్దంటూ ఏకంగా ధర్నా చేపట్టారు. సోమవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో అంబేడ్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వద్ద నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ధర్నాకు దిగారు. సీఐలు శేషగిరిరావు, సాంబశివ రావు ఇద్దరు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
సింగరాయకొండ నాయకుడు కోట శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ.. వైకాపాలో ఉన్న తమపైనే కృష్ణ చైతన్య కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. జాగర్ల మూడికి చెందిన యలమందల రావు మాట్లాడుతూ.. చైతన్య కక్ష సాధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. నా భార్య సర్పంచిగా ఉంది. అయినా నాపై చైతన్య కోపాన్ని పెంచుకుని మా ఇల్లును కూల్చేయాలని అనుకున్నాడని ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
నా దగ్గర పని చేస్తున్న వ్యక్తి నుంచే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై మోపిదేవి, బాలినేని శ్రీనివాసర రావు లాంటి నేతలకు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేదని అన్నారు. అందుకే ఇక వైఎస్ జగన్ కు తెలిసేలా నిరసన చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. అద్దంకి వైకాపా నియోజకవర్గ ఇన్ ఛార్జి ఆగడాలు పెరిగిపోయాయని అడ్డుకోవాలని బహిరంగంగానే నిరసనలకు దిగుతున్న వైనం. సొంత పార్టీ నేతల మధ్య ఇంతటి అగాధం పెరిగిపోతున్న వేళ సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని కార్యకర్తలు వేచి చూస్తున్నారు.