ఆ ఐపీసీ సెక్షన్‌.. అత్తింటి వారిపై కోడళ్ల ఆయుధం..?

ఐపీసీ సెక్షన్ 498-A.. వరకట్న వేధింపుల నుంచి అమ్మాయిలను కాపాడే సెక్షన్.. ఈ సెక్షన్ కింద కేసు పెడితే.. బెయిల్ కూడా రాదు.. అయితే.. ఇప్పుడు ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతోందని ఏపీ హైకోర్టు తెలిపింది. నిరాధార ఆరోపణలతో భర్త, ఆయన కుటుంబ సభ్యులను సులువుగా వేధించేందుకు, అరెస్టు చేయించేందుకు 498-Aను వినియోగిస్తున్నారని ఏపీ హైకోర్టు ఆక్షేపించింది. స్వల్ప కారణాలతో ఫిర్యాదులు చేస్తున్నారని  ఏపీ హైకోర్టు పేర్కొంది.

ఆ సెక్షన్ ను భార్యలు రక్షణ కవచంగా కాకుండా, ఆయుధంగా వినియోగిస్తున్నారని ఏపీ హైకోర్టు  అంటోంది. కుటుంబంలో లెక్కలు తేల్చుకునేందుకు ఈ సెక్షన్‌ను వాడుతున్నారని ఏపీ హైకోర్టు ఓ కేసు విచారణలో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం వైవాహిక వివాదాలు పెరిగిపోతున్నాయని ఏపీ హైకోర్టు  ఆందోళన వ్యక్తం చేసింది. ఓ మహిళ తన భర్త కుటుంబసభ్యులపై నమోదుచేసిన 498-A కేసును కొట్టేసిన హైకోర్టు..ఫిర్యాదులో పేర్కొనవన్ని నిరాధార ఆరోపణలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కట్నం కోసం వేధిస్తూ, క్రూరత్వానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాచర్లకు చెందిన మహిళ కోర్టుకెక్కింది.

సదరు మహిళ తన భర్త, ఆయన సోదరులు, సోదరుల భార్యలు, అత్తమామలపై 2020 లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు 498-A కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు మాచర్ల కోర్టులో విచారణ జరుగుతోంది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ.. ఆ మహిళ తోడి కోడళ్లు, వారి భర్తలు ఏపీ  హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి..ఆధారాలు లేని కారణంగా పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.

నిజమే.. అనేక చట్టాలు ఇలాగే దుర్వినియోగం అవుతున్నాయి. చట్టాలు రూపొందించిన ఉద్దేశాలు ఒకటైతే.. వాటి అమలు తీరు ఇంకోలా ఉంటోంది. ఇలాంటి వాటిపై సమీక్ష జరగాలి. ఇందుకు ఈ హైకోర్టు తీర్పు నాంది కావాలి. అప్పుడే ఆ చట్టాలకు సార్థకత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: