కాణిపాకం.. కొత్త వివాదం..రచ్చ చేస్తున్న బీజేపీ?

కాణిపాకం ఆలయం అభిషేకం టిక్కెట్ ధర పెంపు వివాదం క్రమంగా పెద్దదవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన మంత్రి కొట్టు సత్యనారాయణ అది తనకు తెలియకుండా జరిగిందని.. దీనిపై విచారణ చేయిస్తామని ప్రకటించినా.. బీజేపీ నేతలు మాత్రం విషయాన్ని తేలిగ్గా వదిలేలా లేరు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణ ధర్మంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హితవు పలికారు. కాణిపాకం వినాయకుడి అభిషేకం టిక్కెట్ ధర పెంచేందుకు అభిప్రాయ సేకరణ చేసింది దేవాదాయ శాఖ చేయలేదని చెప్పగలరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు.

కాణిపాకం దేవాలయం విడుదల చేసిన  నోటిఫికేషన్ విషయంలో తాను స్పందించిన తరువాత దేవాదాయ శాఖ నాలిక్కరుచుకుని అవగాహనారాహిత్యంతో అధికారి చేశారని దేవాదాయశాఖ మంత్రి చెప్పడం చూస్తే వైసీపీ ప్రభుత్వ వైఖరి అర్ధం అవుతోందని సోము వీర్రాజు అన్నారు. ఇది అవగాహనా రాహిత్యమా  మంత్రి మౌఖిక ఆదేశాలా అన్నది తేలాల్సిన అంశమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. ఎవరికీ తెలియకుండా అభిప్రాయ సేకరణకు  ఏవిధంగా నోటిఫికేషన్ ఇస్తారని నిలదీశారు. ఇలా నోటి ఫికేషన్  జారీ చేసిన అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది  మీడియా ద్వారా తెలియ చేయాలని  సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

దేవాలయంపై దాడి జరిగితే మతిస్థిమితం లేని వారు చేసిన పనిగా చెబుతారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. అభిషేకం టిక్కెట్టు ధర  నోటిఫికేషన్ అవగాహనా రాహిత్యం అంటారని.. అసలు వీరి మానసిక స్దితి మీదే  అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి  మాట్లాడుతూ బీజేపీ దేవాలయాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారని.. అది నిజమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఆలయాలకు ఏసమస్య వచ్చినా తామే స్పందిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేవాలయాల రక్షణను బీజేపీ తమ బాధ్యతగా భావిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: