
అయ్యో జవాన్ ఆత్మహత్య.. ఆ పోలీసులను వదలొద్దు?
ఎస్పీ స్థాయి అధికారితో కేసు విచారణ చేపట్టాలని అవసరమైతే సిబిఐ ఎంక్వయిరీ వేయాలని ఏలూరి డిమాండ్ చేసారు. సిఐ రంగనాథ్ ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి శిక్షించాలని ఏలూరి అన్నారు. సీఐ రంగనాథ్, జవాన్ కాల్ డేటాను పరిశీలించాలన్నారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా త్వరితగతిన కాల్ డేటాను సేకరించి బహిర్గతం చేయాలని ఏలూరి డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులతో జవాన్ సూర్య ప్రకాష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు.
చినగంజాంలో జాతీయ రహదారి పై ఆర్మిజవాన్ సూర్యప్రకాష్ మృతదేహంతో బైటాయించి మూలగానివారిపాలెంవాసులు ఆందోళనకు దిగారు. జవాన్ సూర్యప్రకాష్ బలవర్మణానికి కారకులైన నిందితులను అరెస్ట్ చేయాలని భాదితుని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చినగంజాం పోలీస్ స్టేషన్ వద్ద బైటాయించి అందోళన చేసి న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. పోలీసులు న్యాయం చేయకపోవడంతో మృతదేహాన్ని ఊరేగింపుగా 2కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి వద్దకు చేరుకొని అక్కడ రాస్తారోకో చేపట్టారు.
ఈ నెల 21న జవాన్ సూర్యప్రకాష్ జమ్మూలో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ యువతి ఈ నెల 7 వ తేదిన తనను వేధించడంటూ చినగంజాం పోలీస్ స్టేషన్ లో సూర్యప్రకాష్ పై ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపం చెంది సూర్యప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. సూర్యప్రకాష్ మృతికి కారకులైన యువతి తండ్రి విజయభాస్కర్ రెడ్డి తో పాటు కుటుంబ సభ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకొని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.