జనసేన కాదు.. నారా-నాదెండ్ల సేన?
జనసేన అసలు.. జనసేన కాదని.. అదంతా నారా-నాదెండ్ల సేన అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గ్లాసు బాబుది.. డోస్ పవన్ కు అంటూ సెటైర్లు వేస్తున్నారు. టీడీపీతో పవన్‌కు డీల్ ఓకే అయిపోయిందని గత మూడు రోజులుగా పవన్ వాగుడు ద్వారా స్పష్టమవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జనసేన అన్నది చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల పుట్టిన పార్టీ అని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ విమర్శలపై మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వచ్చే ఎన్నికల్లో బాబు కోసం పోటీ చేస్తున్నావా లేక నీ కోసం నువ్వు పోటీ చేస్తున్నావా.. అని పవన్ కల్యాణ్‌ను నేరుగా అడిగితే దానికి ఇప్పటి వరకూ సమాధానం చెప్పలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తం 175కు 175 ఎమ్మెల్యే సీట్లలో, 25కు 25 లోక్ సభ సీట్లలో నీ బీ-ఫామ్ మీద అభ్యర్థులను నిలబెడుతున్నావా లేదా అని డైరెక్టుగా అడిగినా.. దానికీ సమాధానం చెప్పలేదని గుర్తు చేస్తునత్నారు. మంగళగిరిలో జనసేనకు వేరే ఆఫీసు ఎందుకు.. ఈ మీటింగ్ ఏదో టీడీపీ ఆఫీసులోనే పెట్టుకుంటే పోయేది కదా అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
నవరత్నాలు, ఇతర పథకాల గురించి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు.. ఏపీ రాష్ట్రంలో పేదల పాలిట శత్రువులుగా మారారని వైసీపీ నేతలు ఆగ్రహించారు. రాజకీయం అంటే సొంత కల్యాణం కాదని లోక కల్యాణం అని పవన్ గుర్తెరగాలని హితవు పలికారు.