విద్యుత్‌: కేసీఆర్‌కు అడ్డంగా దొరికిపోయిన మోదీ?

రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ నుంచి తెలంగాణ రాష్ట్రం.. విద్యుత్తు కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. డిస్కంలు భారీగా బకాయి పడ్డాయని అందుకే ఈ నిషేధం విధిస్తున్నామని రెండు, మూడు రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. ఈ బకాయిలు వెయ్యి కోట్లు దాటాయని తెలిపింది. అయితే ఆ మరుసటి రోజే.. బకాయిల్లో లెక్కలు తేడా వచ్చాయని.. అంత మొత్తం బకాయి లేదని.. 58 కోట్లు బకాయి ఉందని చెబుతూ నిషేధం మాత్రం కొనసాగించింది.

దీనిపై తెలంగాణ సర్కారు మండిపడింది.. కేంద్రం లెక్కలన్నీ తప్పుల తడకలని వాదించింది. అయితే ఇప్పుడు అనూహ్యం కేంద్రం మరోసారి వెనక్కి తగ్గింది. విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేనేలేవి కేంద్రం తాజాగా ప్రకటించింది. అంతే కాదు.. రెండు రోజులుగా ఐఈఎక్స్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధించిన నిషేధాన్ని కేంద్రం అనూహ్యంగా ఎత్తేసింది.

మొదట తెలంగాణ డిస్కంలు రూ.1360 కోట్లు చెల్లించాలని కేంద్రం చెప్పుకొచ్చింది. విద్యుత్తు కొనుగోలు చేయకుండా  తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంది. ఆ తర్వాత ఒక్క రోజులోనే కేంద్రం మాట మార్చింది.. బకాయిలు రూ.52.85 కోట్లు ఉన్నాయని చెప్పింది.. నిషేధాన్ని మాత్రం అలాగే కొనసాగించింది. మళ్లీ అంతలోనే ఇప్పుడు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన పాత బకాయిలు ఏమీ లేవని ప్రకటించింది. అందుకే ఐఈఎక్స్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని ప్రకటన విడుదల చేసింది.

కేంద్రం నిషేధం ఎత్తేయడంతో తెలంగాణ డిస్కంలు ఐఈఎక్స్‌ నుంచి 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేశాయి. కేంద్రం నిషేధంతో తెలంగాణలో విద్యుత్‌ కోతలు తప్పవని అంతా అనుకున్నా.. కేంద్రం తీరుతో ఒక్కసారిగా సీన్ మారింది. ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైనా.. ఇదంతా కేంద్రం తెలంగాణపై చేస్తున్న కుట్ర అంటూ ప్రచారం చేసుకోవడానికి కేసీఆర్‌కు మంచి అవకాశం చిక్కింది. అసలే మునుగోడు ఉప ఎన్నిక జోరు నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఇలా మోడీ సర్కారు కేసీఆర్‌ చేతికి చిక్కడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: