పవన్ కల్యాణ్‌పై ఆ కుల ముద్ర పోతుందా?
పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. అందులోనూ ఆయన కులానికి చెందిన జనాభా ఏపీలో చాలా ఎక్కువ. అయితే ఎంత ఎక్కువ జనాభా ఉన్న కులానికి చెందిన నాయకుడైనా కేవలం.. ఒక్క కులం అభిమానంతో వచ్చే ఓట్లతో అధికారంలోకి రాలేడు. అన్ని వర్గాలు, కులాల ఆదరణ పొందితేనే.. మరో మాటలో చెప్పాలంటే.. కులాలు, వర్గాలకు అతీతంగా తమ వాడని జనం ఆదరిస్తేనే ఆ నాయకుడికి అధికారం దఖలు పడుతుంది.
పవన్ కల్యాణ్ ఎంత కాదన్నా.. ఆయన ఓ కులానికి చెందిన ఓట్లపై ఆధారపడిన నాయకుడిగా చాలా మంది భావిస్తున్నారు.అందుకే పవన్ కూడా తనపై ఆ ముద్ర చెరిపేసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా కడప జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాను కులాన్ని అమ్ముకోవడానికి రాలేదని చెబుతూనే.. సీఎం జగన్ రెడ్డి తీరు పట్ల రెడ్డి సామాజికవర్గమూ సంతోషంగా లేదని చెప్పే ప్రయత్నం చేశారు.
తాను కులాన్ని అమ్ముకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని... మానవత్వం చాటుకోవడానికే వచ్చానని పవన్ అంటున్నారు. కమ్మ, రెడ్డి కులాలతో పాటు మిగతా కులాలకూ సాధికారత రావాలన్న పవన్.. ఇక్కడి నేతల్లో ఆధిపత్య ధోరణి బాగా పెరిగిందని.. తన జీవితంలో కులాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని పవన్ అంటున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాదు.. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే తాను జనసేన పార్టీని పెట్టాని చెప్పడం ద్వారా తనపై కుల ముద్ర పోగొట్టుకోవాలని పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.