పెట్రోల్‌.. రేటు తగ్గినా.. వాయింపు తప్పదా?

పెట్రోల్‌ రేట్లు ఏ రోజుకు ఆరోజు మార్చుకునే వెసులు బాటు ఇచ్చిన దగ్గర నుంచి చమురు కంపెనీలు రేట్లు అదరగొడుతున్నాయి. అదేమంటే అంతర్జాతీయంగా చమురు రేట్లు పెరిగాయ్‌.. మేమేం చేస్తామంటూ వాదనకు దిగుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా చమురు రేట్లు పెరిగితే.. పెట్రోల్ రేట్లు వెంటనే పెంచే చమురు సంస్థలు.. అంతర్జాతీయంగా పెట్రోల్‌ రేటు తగ్గినప్పుడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. అందినకాడికి దోచుకోవడమే లక్ష్యం అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి.


తాజాగా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా తగ్గుతున్నాయి. ఇప్పుడు  6 నెలల కనిష్ఠానికి చమురు ధరలు దిగి వచ్చాయి. కానీ..  ఇప్పుడప్పుడే ఈ రేటు తగ్గింపు ప్రయోజనం మాత్రం దేశీయ వినియోగదారులకు చమురు కంపెనీలు అందించట్లేదు. అదేమంటే..  ఇన్నాళ్లూ నష్టాలు భరించి పెట్రోల్‌, డీజిల్‌ అమ్మామని చెబుతున్నాయి. అందుకే మా నష్టాలు పూడిన తర్వాత రేట్లు తగ్గిస్తామని కొత్త పాట వినిపిస్తున్నాయి.


ఒకసారి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పరిశీలిస్తే... మార్చి నెలలో బ్యారెల్‌ ముడిచమురు ధర 140 డాలర్లకు ఎగబాకింది. కానీ ఇప్పుడు తాజాగా 94.91 డాలర్లకు రేటు దిగి వచ్చింది. ఇది ఇండియాకు చాలా ఊరట కలిగిస్తుంది. మన దేశం 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది కదా.. అందుకే.. అలాగని ఇప్పుడు మన పెట్రోల్‌ రేట్లు తగ్గుతాయా అంటే మాత్రం తగ్గేదే లే అన్నట్టుంది చమురు సంస్థల తీరు.


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గినందువల్ల పెట్రోల్‌పై నష్టాలు బాగా తగ్గాయని చమురు కంపెనీలు చెబుతున్నాయి. కానీ.. డీజిల్‌ను మాత్రం ఇంకా నష్టాన్ని భరించే అమ్ముతున్నామని చెబుతున్నాయి. నాలుగున్నర నెలలుగా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మార్కెట్‌ రేటుకు అనుగుణంగా పెంచలేదని.. అందుకే ఇప్పుడు ఆ లోటు పూడ్చుకుంటామని పెట్రోల్ సంస్థలు చెబుతున్నాయి. మరి సగటు మానవుడికి పెట్రో ధరల ఊరట కలిగేదెన్నడో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: