ప్రపంచానికే బిగ్ బ్యాడ్‌ న్యూస్.. ఇక కష్ట కాలమే?

ప్రపంచాన్ని 2020 నుంచి వరుసగా అనేక విపత్తులు వణికిస్తున్నాయి. కరోనా రూపంలో ప్రపంచం గతంలో ఎన్నడూ చూడని కష్టకాలాన్ని చూసింది. ఆ కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్న తరుణంలో మరోసారి కరోనా రెండోసారి, మూడోసారి అంటూ పంజా విసిరింది. ఆ కష్టాల నుంచి కూడా కాస్త కోలుకుంటున్నామనే సరికి ఇప్పుడు మరో విపత్తు ప్రపంచం ముంగిట నిలుస్తోంది. అదే..  ఆర్థిక మాంద్యం.. అవును.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాంద్యం ముప్పు ఎదుర్కోబోతోందని నిపుణులు చెబుతున్నారు.

అవును.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఏమాత్రం బాగాలేవట. వచ్చే ఏడాది ప్రపంచాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందట. కొవిడ్‌ కారణంగా స్తంభించిన ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు భారీగా డబ్బు పంపిణీ చేశాయి. వాటి వల్ల ధరలు పెరిగాయి. మార్కెట్లో ద్రవ్య లభ్యతను కట్టడి చేసేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. దీని కారణంగా ఇప్పుడు ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే మాంద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రధాన దేశాల్లో ద్రవ్యోల్బణం ఆరు నుంచి 10 శాతం వరకు పెరిగిపోయింది. అగ్రరాజ్యం అమెరికాలోనూ 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరిగింది. అలాగే మౌలిక లోహాల ధరలు తగ్గినందువల్ల ప్రపంచమంతటా క్రమంగా గిరాకీ తగ్గుతోంది. పారిశ్రామికోత్పత్తి మందగించే అవకాశం ఉందనడానికి ఇది సంకేతం అన్నమాట. అదే నిజమైతే ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిన్నట్టే.

ఈ సంకేతాల కారణంగా త్వరలో ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆహార ధాన్యాలు, చమురు సరఫరా పడిపోయింది. వాటి ధరలు పెరిగాయి. కేంద్ర బ్యాంకులు ఉద్దీపనల కారణంగా ఆ డబ్బు స్టాక్‌ మార్కెట్లలోకి, స్థిరాస్తి, క్రిప్టో కరెన్సీ రంగాల్లోకి వెళ్లింది. ఆర్థిక మాంద్యం వస్తే ఆ రంగాలన్నీ దెబ్బతింటాయి. మళ్లీ 1997 ఆగ్నేయాసియా సంక్షోభం, 2008 ఆర్థిక సంక్షోభం తప్పదేమో అన్న ఆందోళన ప్రపంచమంతా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: