తెలంగాణతో వివాదం..అంబటి సంచలన వ్యాఖ్యలు?
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ మీటింగ్‌లోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు గోదావరి వరద కారణంగా భద్రాచలం మునిగిపోయే పరిస్థితి రావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. విలీన మండలాలను తెలంగాణకు ఇవ్వాలని కోరారు. కనీసం ఐదు గ్రామాలైనా తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతున్న సమయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది వివాదమే కాదు.. దయచేసి వివాదం చేయొద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గోదావరి వరదల సందర్భంగా.. తెలంగాణలోనూ, ఆంధ్రాలోనూ కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయని... ఇది కొత్త విషయమేమీ కాదని... తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .. పోలవరం ఎత్తు పెంచడం వల్లే తెలంగాణకు నష్టం జరుగుతుందని.. భద్రాచలం నీట మునిగిందని మాట్లాడటం సరైనది కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇరువురం రెండు రాష్ట్రాల్లో బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నామని.. రెండు రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నామని.. మనమంతా తెలుగు ప్రజలమని.. సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నవాళ్ళమని... ఇది అసలు వివాదమే కాదుని... కొత్త వివాదానికి మీరు అంకురార్పణ చేయొద్దు అని మనవి చేస్తున్నానని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.
భద్రాద్రి మునిగిపోతే ప్రజలు వరదల్లో మునిగితే వివాదం చేయడం భావ్యం కాదన్న మంత్రి అంబటి రాంబాబు.. గతంలో భద్రాచలం మునగలేదా అని ప్రశ్నించారు. అంతరాష్ట్రాల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే.. వాటన్నింటినీ సీడబ్ల్యూసీ, కేంద్రం ఆలోచించి, అధ్యయనం చేసి క్లియరెన్స్ ఇచ్చారన్నారు.