జగనన్నా.. కాస్త ఆ ఉద్యోగులను కరుణించన్నా?

ఇటీవల జగన్ సర్కారు గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించింది. అయితే.. రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారన్న కారణంతో కొన్నాళ్ల క్రితం ఏపీ సర్కారు కొందరు గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల సర్వీసులను మాత్రం క్రమబద్దీకరించకుండా నిలిపేసింది. అలా పక్కన పెట్టిన సుమారు రెండు వేల మంది గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్దీకరించాలని ఎన్‌జీఓల సంఘం తాజాగా డిమాండ్‌ చేసింది.

పీఆర్సీ ఉద్యమం సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ సహా పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడమే ఆ గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులు చేసిన నేరం. అయితే.. ఆ చలో విజయవాడ వంటి ఉద్యమాలు చేసిన ఇతర ఉద్యోగులపై ఎలాంటి చర్యలు లేకుండా కేవలం సర్వీసులు క్రమబద్దీకరణ కాని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులను మాత్రమే ఇలా సర్వీసులు క్రమబద్దీకరించకుండా నిలిపేయండ అన్యాయమే అంటున్నారు ఎన్జీవోలు.

అలాంటి 2 వేల మంది గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల సర్వీసులనుపర్మినెంట్ చేయాలని ఎన్‌జీఓల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో గ్రామ వార్డు, సచివాలయ ఎంప్లాయిస్‌  ఫెడరేషన్‌ రాష్ర్ట కార్య నిర్వాహక సమావేశంలో బండి శ్రీనివాస్ ఈ విజ్ఞప్తి చేశారు.

అంతే కాదు.. కరోనా సోకి చనిపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు. వారికి కారుణ్య నియామకాల కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బండి శ్రీనివాస్‌ కోరారు. రాష్ర్టంలో వేరు వేరు జిల్లాలో ఉద్యోగం చేస్తున్న భార్యా భర్తలకు అంతర జిల్లా బదీలీలు చేపట్టాలని కూడా బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ నెలలో  డిపార్టుమెంటల్ పరీక్ష పాసైన ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించినందుకు త్వరలో విజయవాడలో కృతజ్ఞత సభను నిర్వహించి సిఎం జగన్‌ను ఘనంగా సన్మానిస్తామంటున్నారు. మరి జగనన్న ఆ రెండు వేల మంది ఉద్యోగులను కరుణిస్తాడా.. క్రమబద్దీకరిస్తాడా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: