వామ్మో.. సికింద్రాబాద్ సీన్‌.. గుంటూరులోనూ జరిగేదా?

నూతన సైనిక నియామక విధానం  వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం చేసిన సంగతి తెలసిందే. అయితే.. అదే తరహాలో గుంటూరు రైల్వే స్టేషన్‌లోనూ చేసేందుకు ప్రయత్నించారన్న విషయం ఇప్పుడు పోలీసుల విచారణలో వెలుగు చూస్తోంది. శనివారం నాడు గుంటూరులో ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చలో గుంటూరు రైల్వే స్టేషన్ అంటూ కొన్ని సందేశాలు వాట్సప్ గ్రూపుల్లో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

సికింద్రాబాద్ తరహాలో విధ్వంసం జరగకుండా గుంటూరులో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ గుంటూరులోని ఆర్మీ నియామక అధికారి కార్యాలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలను కూడా సమీక్షించారు. గుంటూరు వస్తున్న  ఆర్మీ ఉద్యోగార్ధులు  ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా అధికారులతో  మాట్లాడి పరిష్కరించు కోవాలని సూచించారు.

అలా కాకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించటం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ఆస్తుల విద్యంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా ఎస్పీ హఫీజ్‌  హెచ్చరించారు. చెప్పుడు మాటలు వినటం, తప్పుడు వాట్సాప్ మెసేజ్ లు చూసి  భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని  గుంటూరు జిల్లా ఎస్పీ హఫీజ్‌  సూచించారు. ఆర్మీ అభ్యర్థులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో  ఎలాంటి ఉద్యోగానికి అవకాశాలు లేకుండా పోతాయని  గుంటూరు జిల్లా ఎస్పీ హఫీజ్‌ హెచ్చరించారు.

ఆవేశాలకు లోనై భవిష్యత్తును చేతులారా పాడు చేసుకోవద్దని  గుంటూరు జిల్లా ఎస్పీ హఫీజ్‌  స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో పోలీసులు గుంటూరు రైల్వే స్టేషన్ లో భద్రత బలగాలు మోహరించారు. గుంటూరు వచ్చే మార్గాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. అగ్ని పథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువత ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర భారతంలోనూ ఇలాంటి ఆందోళనలు బాగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: