కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న చంద్రబాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఏపీలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి జగన్ సర్కారు పూర్తి మద్దతు ఇస్తోంది. మీటర్ల బిగింపు తప్పదని చెబుతోంది. అందుకే ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశంపై ఉద్యమించాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఈ మేరకు 20 వ తేదీ నుంచి రైతు పోరు బాట పేరిట బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు.

రైతుల సమస్యలపై ఉద్యమించాలని తెలుగు దేశం భావిస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో ఆందోళన ఉన్నారని ఆ పార్టీ భావిస్తోంది.  పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మీటర్ల బిగింపును చేపట్టినా.. రైతులు వ్యతిరేకించారన్న భావనలో పార్టీ ఉంది. ఈ మేరకు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు సహా రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరపున సదస్సులు నిర్వహించాలని తెలుగు దేశం యోచిస్తోంది.

రైతుల సమస్యలపై రైతు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఐదేసి పార్లమెంట్‌ స్థానాలు ఒక జోన్‌ పరిధిలో రైతు పోరుబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. ఏడు ప్రధాన సమస్యలపై రైతులను చైతన్యపరచడమే ప్రధాన ఎజెండాగా రైతు పోరుబాట సభలు నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీన కడప పార్లమెంట్‌ పరిధిలో రైతు పోరు బాట నిర్వహిస్తారు. అలాగే ఈనెల  25న నెల్లూరు పార్లమెంట్‌ పరిధి, జులై 1న కాకినాడ, జులై 7న విజయనగరం, జులై 13న విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో రైతు పోరు బాట నిర్వహిస్తారు.

వ్యవసాయ మోటర్లకు మీటర్లు - రైతుల పాలిట ఉరితాళ్లు అనే సమస్య పై తెలుగు దేశం చర్చ చేపట్టబోతోంది. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర, పంట నష్ట పరిహారం చెల్లింపు, పంట కాలువల మరమత్తు - నిర్వహణపైనా చర్చిస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ, బిందు సేద్యం, సూక్ష్మ పోషకాలు అనే అంశాలపై కూడా చర్చించాలని ఆ పార్టీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: