జగన్‌ చేతుల మీదుగా.. చెత్త నుంచి విద్యుత్‌ ?


ఇవాళ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆ జిల్లాలో గుంటూరు శివార్లలోని నాయుడుపేటలో సీఎం పర్యటిస్తారు. అక్కడ చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ విద్యుత్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ 340 కోట్ల రూపాయలతో వ్యయంతో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ  చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తారు.

విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు మరో ఏడు మున్సిపాలిటీల చెత్తను ఇక్కడకు తరలిస్తారు. దాని నుంచి విద్యుత్ తయారు చేస్తారు. చెత్తను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఈ విద్యుత్ తయారీ ప్లాంట్ ఉపయోగపడుతుంది.  గుంటూరు శివార్లలోని నాయుడుపేట వద్ద 15మెగావాట్ల సామర్థ్యంతో ఈ చెత్త నుంచి విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు  ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.

ఈ చెత్త నుంచి విద్యుత్ ప్లాంట్ లోని డంపుల్లో చెత్తను కుళ్లబెడతారు. తద్వారా బయో గ్యాస్ వస్తుంది.  అందులోని మీథేన్ ను మండించటం ద్వారా నీటి ఆవిరిని ఉత్పత్తి చేస్తారు. ఆ నీటి ఆవిరి సాయంతో టర్బైన్లు తిరిగేలా చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు నిర్వహించాలంటే రోజూ 12వందల టన్నుల చెత్త అవసరమని అంచనా.  ఆ చెత్తను సరఫరా చేసే బాధ్యత రెండు కార్పోరేషన్లు, ఏడు మున్సిపాలిటిలకు అప్పగించారు.

చెత్తను తడి చెత్త, పొడి చెత్త గా విభజించి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అధునాతన పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ నిర్మించినట్లు జిందాల్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ జిందాల్ ప్లాంట్ ప్రారంభానికి ముందు సీఎం జగన్ రైతులకు భారీ స్థాయిలో ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు. ఆ కార్యక్రమం తర్వాత  ఈ జిందాల్ ప్లాంట్ ప్రారంభం ఉంటుంది. దీని తర్వాత ముఖ్యమంత్రి తాడేపల్లి వెళ్లిపోతారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు గుంటూరులోట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: