మోడీని జగన్ కోరిన వరాలు ఇవే?

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు.  45 నిమిషాలకు పైగా ప్రధానితో సమావేశమైన ముఖ్యమంత్రి... రెవిన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్‌ కాలేజీలు వంటి అంశాలను ప్రధానికి నివేదించినట్టు సీఎంఓ వెల్లడించింది. ఈమేరకు సీఎం జగన్ ఓ వినతి పత్రాన్నికూడా అందించారు.

2014–15కు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పెన్షన్లు, రైతుల  రుణమాఫీకి సంబంధించి మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్‌ కింద రాష్ట్రప్రభుత్వానికి రావాల్సి ఉందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. ఈ అంశంపై వెంటనే దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.  2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధించడం సరికాదని సీఎం జగన్ సూచించారు.

గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావని.. కోవిడ్‌ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం జగన్ కోరినట్టు తెలుస్తోంది.  అలాగే సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాలని మోదీని సీఎం జగన్ కోరారు. దీనికి ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టులో డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని కూడా సీఎం జగన్ మోదీని కోరారు. గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే పోలవరానికి కూడా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా విడివిడిగా కాకుండా... మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రియింబర్స్‌ చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: