బెంగాలీ సందుల్లో.. ఇక దీదీ వర్సెస్‌ దాదా?

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారా.. త్వరలోనే ఆయన కలకత్తా రాజకీయాల్లో మమతా బెనర్జీని ఢీకొనబోతున్నారా.. ఇప్పుడు బెంగాల్‌లో ఇదే చర్చ జరుగుతోంది. గంగూలీ  రాజకీయ ప్రవేశంపై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు జోరుగా చెలరేగుతున్నాయి. ఇందుకు ఆయన నిన్న పెట్టిన సోషల్ మీడియా పోస్టే కారణం.. తన కొత్త ప్రయాణానికి
మద్దతు ఇవ్వాలంటూ దాదా పెట్టిన పోస్టు..  సౌరవ్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది.


అయితే మొదట బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేసినట్టు మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవికి ఇంకా రాజీనామా చేయలేదని బోర్డు సెక్రటరీ జైషా ఆ తర్వాత మీడియాకు క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద సౌరవ్ గంగూలీ తన కొత్త ప్రయాణం గురించి పెట్టిన పోస్టు రాజకీయ కలకలమే రేపుతోంది. దాదా రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు బెంగాల్‌లో జోరుగా చర్చించుకుంటున్నారు.


సౌరవ్ గంగూలీ క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 ఏళ్లు గడిచాయి. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత  ఇప్పుడు మరో కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు గంగూలీ తన పోస్టులో తెలిపారు. ఇన్నిరోజులూ తనకు అండగా నిలిచారు కదా.. ఇక ముందు కూడా అలాగే ఆదరించడం అంటూ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు దాదా. ప్రజలకు సహాయపడేలా  ఏదైనా చేయాలని భావిస్తున్నానంటూ రాజకీయాల్లోకి రాబోతున్నానని చెప్పకనే చెప్పేశాడు.


తనకు ఈ కొత్త ప్రయాణంలో ఇలాగే మద్దతు ఇస్తారని కోరుకుంటున్నట్లు దాదా ఆశిస్తున్నాడు. అయితే.. గంగూలీ పెట్టిన పోస్టు కొన్ని గంటల్లోనే జోరుగా వైరల్‌గా మారింది. గంగూలీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కొందరు బీజేపీ గంగూలీని ఇంటికెళ్లి కలిశారు. అలాగే ఆయన కూడా కొన్ని రోజుల క్రితం అమిత్‌ షాను కూడా కలిశారు. సో.. ఇక దాదా వర్సెస్ దీదీ సీన్‌ చూడబోతున్నామా..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: