ఆ ఇష్యూలో.. వైసీపీకి అలా కలిసొచ్చిందన్నమాట?

రాజకీయాల్లో అన్ని విషయాలు ఒకేలా ఉండవు.. అన్ని ఘటనలూ ఒకేలా ప్రభావితం చూపించలేవు.. కొన్నిసార్లు కొన్ని ఘటనలు పార్టీలను చాలా డామేజ్‌ చేస్తాయి. అనూహ్యంగా కొన్ని ఘటనలు అంతగా ప్రభావం చూపించలేవు. ఇక్కడ ఘటనల్లో తీవ్రత ఉన్నా..సమకాలీనంగా ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అందుకు ఉదాహరణే ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన అరాచకం విషయం. సాక్షాత్తూ అధికార పార్టీ ప్రతినిధిగా ఉండి.. ఏకంగా ఓ దళిత యువకుడిని దారుణంగా చంపి.. మళ్లీ డెడ్ బాడీని ఇంటి వద్ద డెలివరీ చేసిన ఘటన ఇది.

సాధారణంగా ఇది పార్టీకి చాలా డ్యామేజ్‌ చేయాలి.. కానీ.. కొంత వరకూ డ్యామేజ్‌ చేసింది కూడా.. దళిత సంఘాలు, విపక్షాలు ఈ ఘటనపై బాగానే రచ్చ చేశాయి. కానీ.. అనూహ్యంగా ఆ మరుసటి రోజే.. అమలాపురంలో కోనసీమ జిల్లా పేరు మార్పు పై ఏర్పాటు చేసిన ర్యాలీ.. హింసాత్మకంగా మారడం.. ఏకంగా మంత్రి, ఎమ్మెల్యేల ఇల్లు తగలబెట్టడంతో టాపిక్ డైవర్షన్ జరిగిపోయింది. ఆ తర్వాత నాలుగైదు రోజులు అమలాపురం ఘటనే వార్తల్లో ప్రముఖంగా కవర్ అయ్యింది. అనంతబాబు ఇష్యూని మీడియా కూడా మరిచిపోయింది.

అయితే.. అనంతబాబు ఘటనలో ఎమ్మెల్సీ స్వయంగా నేరం ఒప్పుకోవడం.. పోలీసులకు దొరకడం, జైలుకు రిమాండ్‌ కోసం వెళ్లడం కారణంగా కూడా గొడవ కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత టీడీపీకి మహానాడు వచ్చేయడం.. అప్పటికే  జగన్ దావోస్‌ వెళ్లి ఉండటం.. వైసీపీ మంత్రుల బస్సు యాత్ర.. ఇలా అనేక కొత్త విషయాల మాటున సుబ్రహ్మణ్యం దారుణ హత్య ఘటన మరుగున పడిపోయంది. విచిత్రంగా దళిత సంఘాలు కూడా ఈ అంశంపై ఆ తర్వాత పెద్దగా ఆందోళనలు చేస్తున్నట్టు లేదు.

నిందితుడే దొరికిపోయాడు కనుక.. నేరం ఒప్పుకున్నాడు కనుక.. అంతకు మించి ఆందోళనలు చేయడానికి కూడా స్కోప్‌ లేకపోవడం మరో కారణం కావచ్చు. ఏదేమైనా మాయని మచ్చగా వైసీపీ చరిత్రలో నిలిచిపోయే ఈ ఎపిసోడ్ నుంచి సాధ్యమైనంత తక్కువ డ్యామేజ్‌తోనే వైసీపీ బయటపడింది. విచిత్రం ఏంటంటే.. ఇంకా అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించకపోవడం.. కేవలం పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేయడం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: