తగ్గుతున్న చైనా.. ఇక ఇండియానే నెంబర్‌ వన్‌?

ఆ విషయంలో చైనా జోరు తగ్గుతోంది. ఇండియా దూసుకుపోతోంది. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ నెంబర్‌ వన్‌గా తన స్థానం పదిలపరుచుకున్న చైనాకు ఇక ఇండియా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇంతకీ ఈ పోటీ  ఏ విషయంలో అంటరా.. అదే జనాభా విషయంలో.. చైనాలో జనాభా క్రమంగా తగ్గుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం ప్రపంచ జనాభాలో ఆరో వంతు చైనాలోనే ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటి చైనా దేశంలో ఈ సారి జనాభా వార్షిక వృద్ధి రేటు గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయిందట.

1959-61 కరవు తర్వాత మళ్లీ ఇప్పుడు  మొదటి సారి చైనాలో జనాభా పెరుగదల రేటు తగ్గుముఖం పట్టిందట. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 2021లో చైనా జనాభా 1.41212 బిలియన్ల నుంచి 1.41260 బిలియన్లకు పెరిగిందట. అంటే చైనా జనాభా పెరుగుదల ఈ ఏడాదిలో కేవలం 4,80,000 మాత్రమే. కానీ గత దశాబ్దంలో చైనాలో ఏటా కనీసం 80 లక్షల వరకూ ఈ పెరుగుదల ఉండేది. అంటే చైనా జనాభా పెరుగుతోంది కానీ.. అతి తక్కువగా పెరుగుతోందన్నమాట.

1980ల్లో చైనాలో బర్త్ రేటు 2.6గా ఉంటే మరణాల రేటు 2.1 గా ఉండేది. 1994 తర్వాత బర్త్ రేటు 1.6, 1.7 మధ్య ఉండేది.. ఆ తర్వాత  2020 నాటికి చైనాలో బర్త్ రేటు 1.3కు పడిపోయింది. 2021లో మరీ దారుణంగా 1.15కి పడి పోయింది. జనాభా పెరుగుదల మరీ ఇంత తక్కువగా ఉన్నా కష్టమే. అందుకే చైనా ఒకే సంతానం విధానాన్ని తొలగించింది.. ముగ్గురు పిల్లల వరకూ కనొచ్చని ప్రకటించింది. అలా కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు.  

చైనాలో జనం చిన్న కుటుంబాలకు అలవాటు పడ్డారు. జీవన వ్యయం బాగా పెరగడం కూడా మరో కారణం. వివాహ వయస్సు పెరుగుతోంది. పిల్లలను కనడంలో ఆలస్యమవుతోంది. పిల్లలను కనాలన్న ఆసక్తి కూడా తగ్గుతోంది. చైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ దశాబ్దంలోనే భారత్.. చైనాను  జనాభా విషయంలో అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: