తీన్మార్‌ మల్లన్నకు పువ్వాడ రూ. 10 కోట్ల షాక్?

తీన్మార్ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ షాక్ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు రూ. 10 కోట్ల మేరకు పరువు నష్టం దావా  వేశారు. ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ తీన్మార్‌ మల్లన్నపై తెలంగాణ రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దావా వేశారు. హైదరాబాద్‌ న్యాయవాదులు పేరి వెంకటరమణ, పేరి ప్రభాకర్‌ ద్వారా రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. వారి ద్వారా తీన్మార్ మల్లన్నకు పువ్వాడ నోటీసులు పంపించారు.

ప్రజాసేవలో ఉన్న తమ క్లయింట్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రచారం పొందాలని తీన్మార్ మల్లన్న భావిస్తున్నారని పువ్వాడ తన నోటీసులో తెలిపారు. దురుద్దేశంతో తీన్మార్‌ మల్లన్న తన చానల్, పత్రికలో అబద్ధాలు ప్రసారం చేశారని పువ్వాడ తన నోటీసులో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన మల్లన్న జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ అసత్యపు ప్రచారం చేశారని పువ్వాడ తెలిపారు. సివిల్, క్రిమినల్‌ చట్టాల ప్రకారం రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని దావా వేసారు. లేకపోతే చట్టప్రకారం తగిన చర్యలకు బాధ్యులవుతారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

ఏడు రోజుల్లోగా తన క్లయింట్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయనకు చెందిన న్యాయవాదులు తాము ఇచ్చిన నోటీసులో సూచించారు.  ఇక తీన్మార్ మల్లన విషయానికి వస్తే.. ఆయన కొన్నేళ్లుగా తన క్యూ మీడియా ద్వారా రాజకీయ విశ్లేషణలు చేస్తూ ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. ఆయన యూ ట్యూబ్ ఛానల్‌కు లక్షల మంది సబ్‌ స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు.. ఆయన ఉదయం చేసే పత్రికా విశ్లేషణను లక్షల మంది లైవ్ ద్వారా వీక్షిస్తుంటారు.

ప్రత్యేకించి ప్రభుత్వాన్ని నిలదీస్తూ తీన్మార్ మల్లన్న చేసే వీడియోలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి పువ్వాడ అంటున్నారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: