ఉద్యోగులకు శుభవార్త జెప్పిన జగన్?
ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగించారు. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు నెలల పాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు కాలంలో ప్రవేశ పెట్టిన ఈ వెసులు బాటును జగన్ ప్రభుత్వం కూడా ఎప్పటి కప్పుడు పొడిగిస్తూ వస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లుగా ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. గతంలో అధికారంలోకి రాగానే సీపీఎస్ వ్యవస్థ రద్దు చేస్తానని సీఎం జగన్ మాట ఇచ్చారు.
కానీ ఆ మాట ఆయన ఇప్పటి వరకూ నిలబెట్టుకోలేకపోయారు. ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. దీనిపై తాజాగా ఓ కమిటీ వేసి మరింత కాలం పొడిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులను నిరాశ పరిచింది. గతంలో ఐఆరే 27 శాతంగా ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఫిట్ మెంట్ ను అంతకు తగ్గించి డిసైడ్ చేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కారణమైంది.
అయితే.. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల ఇంతకంటే ఏమీ చేయలేమని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఏది ఏమైనా కారణాలు ఏవైనా.. జగన్ ప్రభుత్వం అంటే ఉద్యోగులు మాత్రం మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న ఊరటలు కూడా ఇవ్వకపోతే.. తమపై మరింత వ్యతిరేకత వస్తుందని సీఎం జగన్ భావించారో ఏమో.. ఈ వెసులు బాటు కల్పించారు.