హవ్వ.. పదో తరగతి పరీక్షలపైనా రాజకీయాలా?

ఏపీలో ఏదీ రాజకీయాలకు అతీతంగా లేదు. చివరకు పదో తరగతి పరీక్షల విషయంలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయట. ఇటీవల ఏపీలో పరీక్షలు మొదలైన రోజు నుంచి పేపర్లు లీకయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల పరీక్ష మొదలయ్యాక వాట్సప్‌లో ప్రశ్నాపత్రాలు కనిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు కూడా విమర్శించారు. అయితే.. దీనిపై వివరణ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఓ పథకం ప్రకారం ఈ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు.


చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల సిబ్బందితో సహా మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించిన ఏడుగురితో పాటు, నంద్యాలలో కూడా  పలువురు ఉపాధ్యాయులను  పోలీసులు అరెస్టు చేశామని మంత్రి బొత్స అంటున్నారు. పరీక్షా పత్రాలు బయట మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రశ్న ప్రత్రాలు లీకవుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.


పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తూ దొరికిపోయిన తమ సొంత పార్టీకే చెందిన నారాయణ, తదితర విద్యా సంస్థల గురించి టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన వారే అక్రమాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు  ఉందా? అని సూటిగా మంత్రి బొత్స ప్రశ్నించారు. ఒకట్రెండు చోట్ల తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరీక్షలు ప్ర్రారంభమైన తరువాత కుట్రపూరితంగా విద్యార్ధులకు సమాధానాలు చేరేలా పథకం ప్రకారం యత్నిస్తూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.


అరెస్టైన వారి ద్వారా ఈ విషయం ఇప్పటికే వెల్లడైందని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఆరు లక్షలకు పైగా విద్యార్దులకు సంబంధించిన అంశంలో రాజకీయాలను చొప్పించవద్దని..  పరీక్షలను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స అంటున్నారు. దేవుడా.. ఇదేం గోల నాయనా..పరీక్షలపైనా రాజకీయాలా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: