జగన్‌.. అభినవ అంబేద్కర్‌.. అభినవ గాంధీ?

ఏపీలో ఇటీవల కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ మంత్రి వర్గంలో బడుగులకు పెద్ద పీట వేశామని.. 70 శాతం మంత్రి వర్గాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే  కేటాయించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇక ఎన్నాళ్లుగానో మంత్రి పదవి కోసం ఎదురు చూసిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆ పదవి దక్కడంతో జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది ఎంతగా ఉందంటే.. విపక్షాలు జగన్‌ మంత్రి మండలిని భజన మండలి అని విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా.. మనకేంటి అంటూ జగన్‌ను పొగడటంతో మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు.

ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన  మేరుగ నాగార్జున.. ఆ ఆనందంలో జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారని మెచ్చుకున్నారు. తాను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామినవుతానన్నారు. అంతే కాదు.. గతంలో ఓ లీడర్ జగన్‌ను అభినవ గాంధీ అని పిలుచుకుని పరవశిస్తే.. ఇప్పుడు మేరుగ నాగార్జున.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినవ అంబేడ్కర్‌ అంటూ కీర్తిస్తున్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగుతోందంటున్నారు మేరుగ నాగార్జున. గతంలో చంద్రబాబునాయుడిని అంబేడ్కర్‌ విగ్రహం పెట్టాలని తాము కోరితే ఎక్కడో తుప్పల్లో ఒక మూలన పెట్టే యత్నం చేశారని మేరుగ నాగార్జున గుర్తు చేస్తున్నారు. చివరకు దాన్నీ పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. అదే వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తాము అడగకుండానే విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం పెడుతున్నారని.. ఆయనకు అంబేడ్కరిజంపై ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవాలని పొగడ్తలతో ముంచెత్తారు.

జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారని.. ఇప్పుడు కూడా కీలకమైన ఉప ముఖ్యమంత్రి నుంచి, హోం,  రవాణా, సాంఘిక సంక్షేమ, పురపాలక, ఎక్సైజ్‌ వంటి శాఖలను బహుజనులకు కట్టబెట్టారని మేరుగ నాగార్జున గుర్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రైనా  ఇంత సామాజిక న్యాయంతో పాలన సాగించారా అని మేరుగ నాగార్జున ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: