సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ ఉగాది చురకలు?

ఇవాళ ఉగాది.. ప్రముఖ నాయకులు, సెలబ్రెటీలు అందరూ శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ.. రాష్ట్రపతి మొదలుకుని.. ప్రధాని, సీఎం, రాష్ట్ర గవర్నర్లు అందరూ ఉగాది శుభాకాంక్షలు చెబుతారు. అయితే.. కొత్త ఏడాది కాబట్టి.. ఈ ఏడాది అంతా ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు చెబుతుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అలాగే ఉగాది శుభాకాంక్షలు చెప్పారు.మన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శుభకృత్ నామధేయంతో తరలి వచ్చిందన్నారు.


పేరులోనే శుభాలను ఇనుమడింపచేసుకున్న ఈ శుభకృత్ ఉగాది ప్రజలందరికీ శుభాలు కలుగచేయాలని మనసారా కోరుకుంటున్నానని ఉగాది శుభాకాంక్షలు చెప్పారు పవన్ కల్యాణ్..పంటలు పుష్కలంగా పండి రైతులు, సమృద్ధిగా వ్యాపారాలు జరిగి వ్యాపారస్తులు, కార్మికులు, వృత్తి ఆధారిత కళాకారులు సమస్త జనులు సుఖ సంపదలతో  విరాజిల్లాలని  కోరుకుంటున్నానంటూ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్.. చివర్లో సీఎం జగన్‌కు తనదైన శైలిలో చురకలు వేశారు.


ధరాఘాతాలు, పన్ను పోట్లు లేని పాలనను అందించే విధంగా పాలకులలో కరుణ నింపాలంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ముక్తాయించారు పవన్ కల్యాణ్. ఈ చురకల వెనుక ఇటీవల జగన్ సర్కారు పెంచిన కరెంటు చార్జీలు, వివిధ రకాల పన్నులు వంటివి ఉన్నాయి. జగన్  పాలనను ఎండగట్టేందుకు పవన్ కల్యాణ్ ఉగాది శుభాకాంక్షల అవకాశాన్ని కూడా వదులుకోలేదన్నమాట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్న పవన్ కల్యాణ్‌.. ఇటీవల రాజకీయంగా చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే.


ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పటికే పొత్తులకు సిద్ధం అని ప్రకటించడం ద్వారా జగన్‌ను ఓడించడమే తన లక్ష్యం అని  పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పేశారు. మరి ఈ శుభకృత్‌ నామ సంవత్సరంలో పవన్ కల్యాణ్ ఏం పోరాటాలు చేస్తారో.. జగన్‌ను ఎలా ఇరుకున పెడతారో చూడాలి. ఉగాది శుభాకాంక్షలతోనే చురకలు ప్రారంభించిన పవన్.. ఇక దూకుడు పెంచుతారనే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: