రూ.48 వేల కోట్లు మాయం.. చంద్రబాబు పాపమేనట?

ఇటీవల ఏపీలో రూ.48 వేల కోట్ల రూపాయలు మాయం అయ్యాయని.. ఈ విషయాన్ని కాగ్ నివేదిక బయటపెట్టిందని టీడీపీ నానా రచ్చ చేస్తోంది. ఈ మేరకు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వంటి వారు జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికార పార్టీ వివరణ ఇచ్చుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇస్తూ.. అదంతా చంద్రబాబు పాపమేనంటూ కొత్త వాదన వినిపించారు.

యనమల సహా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అసలు యనమల చెబుతున్న 48వేల కోట్లు వాస్తవిక వ్యయం కాదంటున్నారాయ. ఆ మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జరిగిన ‘బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌’ అనే విషయం  టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్‌ బిల్లులంటూ ఏమీ ఉండవని.. చంద్రబాబునాయుడు హయాంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా రూపొందించిన సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ కారణంగానే  ఈ గందరగోళం తలెత్తిందంటున్నారు.


ఈ సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థలో బిల్లుల చెల్లింపులకు బీఎల్‌ఎం మాడ్యూల్‌ను పొందు పర్చారని చెబుతున్న బుగ్గన.. ట్రెజరీ కోడ్‌ ప్రకారమే ఈ బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు.  సీఎఫ్‌ఎంఎస్‌ ని క్రమపద్ధతిలో వ్యవస్థీకృతం చేయలేదని  అందుకే బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లు స్పెషల్‌ బిల్లుల కింద చూపారని మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం ఆర్థిక శాఖ, ట్రెజరీ నిబంధనల మేరకే జరిగిందంటున్న బుగ్గన.. ఈ విషయంపై ఆర్థిక శాఖ కార్యదర్శి కాగ్‌కు లేఖ రాశారంటున్నారు బుగ్గన.


అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదని.. నగదు లావాదేవీలు లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని మంత్రి బుగ్గన ఎదురు ప్రశ్నించారు. 48వేల కోట్ల వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. అడ్డదిడ్డంగా ఉన్న సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటున్న బుగ్గన.. మొత్తానికి ఈ గందరగోళం అంతా చంద్రబాబు పుణ్యమేనని చెప్పకనే చెబుతున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: