'రాష్ట్రపతి' ప్రచారమే మాయావతి కొంప ముంచిందా?

మాయావతి.. బీఎస్పీ నేత.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఒకప్పుడు అధికార పీఠం హస్తగతం చేసుకున్న నాయకురాలు. కాన్సీరామ్ అడుగుజాడల్లో దళితుల అభివృద్ధి కోసం నడుంబిగించిన వనితగా పేరుతెచ్చుకున్న మాయావతి.. ఆ తర్వాత కాలంలో తన ప్రాభవం కోల్పోయారు. ఒకప్పుడు అధికారం హస్త గతం చేసుకున్న మాయావతి.. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 403 సీట్లలో పోటీ చేస్తే.. కేవలం ఒక్కటంటే ఒక్క చోట మాత్రమే ఆమె పార్టీ విజయం సాధించింది.


అయితే.. ఎన్నికల్లో పరాజయం తర్వాత సమీక్షించుకున్న మాయావతి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిగా తనను ఏ పార్టీ ప్రతిపాదించినా అంగీకరించబోనని చెబుతున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై సమీక్ష  తర్వాత ఆమె ఈ ప్రకటన విడుదల చేశారు. ఆమె ఈ ప్రకటన విడుదల చేయడం వెనుక ఓ ఆసక్తికరమైన రాజకీయం ఉంది. శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ  గెలుపునకు సహకరిస్తే తనను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటిస్తామని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందంటున్నారు మాయావతి.


ఈ రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం ద్వారా బీఎస్పీ తమ పార్టీ శ్రేణులను తప్పుదోవ పట్టించిందని మాయావతి ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రారంభించిన ఈ ప్రచారంలో ఆర్ఎస్‌ఎస్‌ వంటి హిందూ శక్తులు కూడా పాలుపంచుకున్నాయట. ఈ దుష్ప్రచారం కారణంగా తమ కార్యకర్తలు అయోమయంలో పడ్డారని.. ఈ రాష్ట్రపతి పదవి ప్రచారంతో తనను రాజకీయంగా దెబ్బ తీశారని మాయావతి గుండెలు బాదుకుంటున్నారు.  


ఏదేమైనా జరగాల్సిన పని జరిగిపోయింది. అందుకే ఇప్పుడు మాయావతి మళ్లీ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాన్షీరామ్‌ ఆశయాలను తాను గట్టి క్రమశిక్షణతో పాటిస్తానంటున్నారు. కాన్షీరామ్ కూడా గతంలో ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారని మాయావతి గుర్తు చేస్తున్నారు. అలాంటి ప్రతిపాదనను అంగీకరిస్తే బీఎస్పీని అంతం చేసినట్లే అంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేప్రయత్నం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: