
బిగ్ షాక్: రేపు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా?
పాక్‌లో ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన రేపు రాజీనామా చేయబోతున్నారన్నది అందులో ఒకటైతే.. ఆయన్ను ఎల్లుండి అరెస్టు చేస్తారన్నది కూడా మరో ఊహాగానం. విదేశీ నిధుల కేసులో సోమవారం ఇమ్రాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ముందుగా పసిగట్టబట్టే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా అస్త్రం ప్రయోగిస్తున్నట్టు కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసేందుకు దారి తీసిన పరిస్థితులు గమనిస్తే.. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విపక్షాలు కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నాయి.
అంతే కాదు.. ఈనెల 8న ప్రతిపక్ష పార్టీలకు చెందిన వంద మంది ఎంపీలు ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానంపై జరగాల్సిన చర్చ ఈ నెల 28కి వాయిదా పడింది. షాకింగ్ ఏంటంటే.. ఈ అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. అంతే కాదు.. ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై సైన్యం కూడా విశ్వాసం కోల్పోయింది. ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా సైన్యంలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సైన్యం కోపంగా ఉంది. ఇలా అన్నివైపుల నుంచి సమస్యలు చుట్టు ముట్టడంతో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.