సమ్మక్క: చిన జీయర్‌ స్వామిని టార్గెట్‌ చేసిందెవరు?

చిన జీయర్ స్వామి.. ఓ తెలుగు ఆధ్యాత్మిక వేత్త.. ఆయనకంటూ ఓ పీఠం ఉంది. ఇటీవల ముచ్చింతల్‌లోని 269 అడుగులు ఎత్తైన రామానుజ విగ్రహం ఏర్పాటు ద్వారా చిన జీయర్ స్వామి పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఈ సమతా కేంద్రం ప్రారంభానికి.. ఆ విగ్రహావిష్కరణకూ ఏకంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు క్యూ కట్టారు.. దీంతో ఆయన పేరు బాగా వార్తల్లోకి ఎక్కింది. అయితే.. ఇప్పుడు అలాంటి చిన జీయర్ స్వామి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు.


తెలంగాణ గిరిజన దేవతలు సమ్మక్క, సారక్కలపై ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. సమ్మక్క, సారక్కలేమైనా దేవతలా.. వారు బ్రహ్మలోకం నుంచి దిగొచ్చారా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. చిన జీయర్ తీరుపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమ్మక్క, సారక్కల వద్ద వ్యాపారం జరుగుతోందని.. ఇది పాపం అంటూ చిన జీయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మరి సమతా కేంద్రం వద్ద జరుగుతున్నదేంటని ప్రశ్నిస్తున్నారు.


ఆ వ్యాఖ్యలు తప్పే.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఇక్కడ మరో విషయం గమనించాలి. ఆ వీడియో ఇప్పటిది కాదు.. ఎప్పుడు చెప్పినా తప్పే అనుకోండి. కానీ.. ఎప్పుడో 10-15 ఏళ్ల నాటి వీడియో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది. ఎవరు దాన్ని వెలికి తీశారు. ఇప్పుడే ఎందుకు అది ట్రోల్ అవుతోంది. ప్రత్యేకించి సీఎం కేసీఆర్‌తో చిన జీయర్‌కు విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ ట్రోలింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో చినజీయర్ స్వామిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం యథాలాపంగా జరిగిందేనా.. లేకుంటే ఎవరైనా చినజీయర్ స్వామిని టార్గెట్ చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా చినజీయర్ వ్యాఖ్యలు మాత్రం గర్హనీయం. ఇంత రచ్చ అవుతున్న నేపథ్యంలో ఆయన స్వయంగా వివరణ ఇస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: