అన్నా.. జగనన్నా! ఆ మాట నిలబెట్టుకోవేమన్నా?

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 మంది వరకూ నాటు సారా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇందులో చాలా వరకూ కుటుంబాలను పోషించే బాధ్యతలో ఉన్న వారే.. చిన్న చిన్న కుటుంబాలు.. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలు.. చిరు ఆదాయంతో పొట్టపోసుకుంటున్న కుటుంబాలు.. ఇంటి పెద్ద బయటకు వెళ్లి నాలుగు రూపాయలు తెస్తే తప్ప బతుకు గడవని కుటుంబాలు.. అలాంటి 20 కుటుంబాల్లో ఇప్పుడు నాటు సారా సునామీ సృష్టించింది.


ఇప్పుడు ఆ కుటుంబాలను పోషించేదెవరు.. ఆ పిల్లలను చదివించేదెవరు.. ఆ కుటుంబాలు ఎలా బతకాలి.. పోయిన వాళ్లతో పాటే వారు కూడా ఇంత విషం పుచ్చుకుని చనిపోవాలా అంటూ బాధితులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు.. అసలు ఈ పాపాలకు, ఈ మరణాలకు బాధ్యత ఎవరిది.. కుటుంబాలున్నా లక్ష్యం లేకుండా నాటు సారా తాగిన వారిదా.. నాటు సారా పెచ్చు మీరుతుందని తెలిసినా.. స్థానికులు పలుసార్లు కంప్లయింట్లు ఇచ్చినా ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వదిలేసిన ఆబ్కారీ శాఖ సిబ్బందిదా..


వీరెవరూ కాదంటే.. నేను అధికారంలోకి వస్తే.. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానని చెప్పి మూడేళ్ల అధికారం పూర్తి చేసుకున్నా.. ఆ హామీని పట్టించుకోని సీఎం జగన్‌దా.. ఎవరిదీ పాపం.. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని సీఎం జగన్ చెప్పిన మాటలను అక్కడి మహిళలు గుర్తు చేసుకుంటున్నారు.. మద్యం రేట్లు పెరిగే సరికి.. అంత డబ్బు పెట్టలేని బడుగు జీవులు తక్కువ ధరకే లభించే నాటుసారా తాగుతున్నారు.. ఆ నాటు సారా తయారీలో అడ్డమైన రసాయనాలను కిక్కు కోసం కలుపుతున్నారు.


అవి కాస్తా విషంగా మారి.. కడుపులోకి వెళ్లి పేగులను కాల్చేస్తున్నాయి. కాలేయాన్ని జల్లెడగా మార్చేస్తున్నాయి. ఇకనైనా సీఎం జగన్ మద్యపాన నిషేధం హామీని అమలు చేసే ప్రయత్నం చేయాలి. ఈ నాటు సారా మరణాలను అడ్డుకోవాలి.. ఇది చిన్న విషయం కాదు. నిర్లక్ష్యం చేయాల్సిన విషయం అసలే కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: