
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. భారత్ కీలక నిర్ణయం..?
అయితే.. రష్యా భీకర దాడులతో మన పౌరుల ప్రాణాలు కాపాడుకోవడం ఇండియాకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే భారత సైన్యాన్ని రంగంలోకి దింపాలని ఇండియా భావిస్తోంది. వైమానిక దళంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్లను ఎయిర్ లిఫ్ట్ చేయడానికి భారత విదేశాంగ శాఖ సిద్దం అవుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లను భారత వాయు సేన చేసుకుంటోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వెల్లడించారు.
ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ తీసుకొచ్చేందుకు ఉన్న ప్రత్యామ్నాయ అవకాశాలన్నింటినీ ఇండియా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి.. విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితోనూ మాట్లాడతారని తెలిపారు.
రష్యా సైన్యం ఇప్పటికే ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. రష్యా, బెలారస్ వైపు ఉన్న తూర్పు ప్రాంతాల మీద మొదట రష్యా తన గురి పెట్టింది. అయితే.. భారతీయులు ఉన్న చాలా ప్రాంతాల్లో యుద్ధం వాతావరణం లేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశమే అయినా.. ఒకసారి యుద్ధం మొదలైతే పరిణామాలు ఎలా మారతాయో ఊహించలేం. ఇప్పటికే నిత్యావసరాలు దొరకడం కష్టంగా మారింది. ఇండియన్లు అత్యవసరం అయితే తప్ప నివాసాల నుంచి బయటకు రావద్దని విదేశాంగ శాఖ సూచించింది. ఏదేమైనా యుద్ధం సమయంలో మన వాళ్లందరినీ సురక్షితంగా మాతృదేశానికి తీసుకురావడం అంత సులభమేమీ కాదు.